మారేడుమిల్లి/ గంగవరం, పెన్ పవర్ ఏప్రిల్ 10 :
గిరిజన ప్రాంతాల్లో రబ్బర్ సాగును విస్తరించి రైతులను ఆర్థికంగా బలోపేతం చేయడం ప్రభుత్వ లక్ష్యమని భారత ప్రభుత్వ గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ డైరెక్టర్ డాక్టర్ వర్ణాలి దేఖ తెలిపారు.శుక్రవారం మారేడుమిల్లి మండలం దేవరపల్లి గ్రామంలో ఐటీడీఏ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన రబ్బర్ ప్లాంటేషన్‌ను ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా రంపచోడవరం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి, పోలవరం జిల్లా జాయింట్ కలెక్టర్ బచ్చు స్మరణ్ రాజ్‌తో కలిసి ప్లాంటేషన్ పరిస్థితులను సమీక్షించారు.ఈ సందర్భంగా డాక్టర్ వర్ణాలి దేఖ మాట్లాడుతూ, ప్రాంతంలో మరో 3 వేల ఎకరాల్లో రబ్బర్ సాగు విస్తరణకు రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నామని తెలిపారు. ప్రస్తుతం ఉన్న రబ్బర్ సొసైటీలు, క్లస్టర్లు, రైతుల సంఖ్య, సాగు విస్తీర్ణంపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. అలాగే రబ్బర్ ప్రాసెసింగ్‌కు సంబంధించిన స్మోకింగ్ రూముల సంఖ్య, రైతుల అభివృద్ధి పరిస్థితులపై కూడా ఆమె ఆరా తీశారు.రబ్బర్ సాగు చేపట్టిన రైతులకు ప్రభుత్వం నుంచి ప్రోత్సాహకాలు అందిస్తున్నామని, మార్కెట్లో రబ్బర్‌కు మంచి డిమాండ్ ఉందని పేర్కొన్నారు. గిరిజన రైతులు ఆర్థికంగా అభివృద్ధి చెందడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. రబ్బర్ సాగులో ఎలాంటి సమస్యలు ఉన్నా రబ్బర్ బోర్డు అధికారులను సంప్రదించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో జిల్లా ఉద్యానవన శాఖ అధికారి పి. దేవదానం, రబ్బర్ డెవలప్మెంట్ అధికారి సుశాంత్ కుమార్ నాయక్, డీపీఎం దుర్గాప్రసాద్, డిఆర్డిఏ యాంకర్ పర్సన్ రామరాజు, రబ్బర్ బోర్డు ఫీల్డ్ అధికారి ఎల్. సాయి మౌళి, శోభన్ బాబు తదితరులు పాల్గొన్నారు.

