… న్యాయం కోసం వెళ్లిన మహిళలకు అవమానం
కాజులూరు, ఏప్రిల్ 12 ,పెన్‌పవర్:
న్యాయం కోసం ఆశ్రయించిన ఇద్దరు మహిళలకు అవమానం ఎదురైన ఘటన కాజులూరు మండలంలో కలకలం రేపుతోంది. జనసేన పార్టీకి చెందిన స్థానిక నాయకుడు అన్యం శ్రీరామచంద్రమూర్తిపై కులదూషణ ఆరోపణలు వెల్లువెత్తాయి.
ముగ్గురు వ్యక్తులు కలిసి నిర్వహిస్తున్న వ్యాపారంలో తలెత్తిన వివాదాన్ని పరిష్కరించాలని కోరుతూ సన్నపు లక్ష్మి (ఎస్సీ-మాల), ఆకుల నాగదేవి అనే ఇద్దరు మహిళలు అన్యం శ్రీరామచంద్రమూర్తిని ఆశ్రయించారు. అయితే, సమస్యకు పరిష్కారం చూపాల్సిన స్థానంలో ఆయన కులం పేరుతో దూషిస్తూ, అసభ్య పదజాలంతో మాట్లాడి తమను తీవ్రంగా అవమానించాడని వారు ఆరోపిస్తున్నారు.
బాధితుల ప్రకారం, “మా సమస్య చెప్పుకోడానికి వెళ్లగా ‘మాలవాడి గొడవలు నేను తీర్చను… ఇక్కడి నుంచి వెళ్లిపోండి’ అంటూ దురుసుగా ప్రవర్తించాడు. మేము ప్రశ్నించగా మరింత దారుణంగా దూషించాడు” అని సన్నపు లక్ష్మి వాపోయింది. మహిళలమని కూడా గుర్తించకుండా తక్కువ చేసి మాట్లాడాడని ఆకుల నాగదేవి తెలిపారు.
ఈ ఘటనతో తీవ్ర మనోవేదనకు గురైన వారు శనివారం గొల్లపాలెం పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఎస్‌ఐ మెహన్ కుమార్‌కు ఫిర్యాదు చేశారు. జరిగిన అవమానాన్ని పూర్తిగా వివరించి, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీస్ చట్టం కింద కేసు నమోదు చేసి తమకు న్యాయం చేయాలని కోరారు.
మీడియాతో మాట్లాడిన బాధితులు, “అతను వాడిన పదజాలాన్ని చెప్పలేకపోతున్నాం. అంత అవమానకరంగా మాట్లాడాడు. ఒక నాయకుడి వద్ద న్యాయం కోసం వెళ్లి ఇలాంటి అనుభవం ఎదురవుతుందని ఊహించలేదు” అంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. “స్త్రీలమని కనీస గౌరవం కూడా ఇవ్వలేదు” అని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ ఘటనపై దళిత సంఘాల నేతలు తీవ్రంగా స్పందించారు. బాధితులకు పూర్తి మద్దతు ప్రకటిస్తూ, కులదూషణలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే అన్యం శ్రీరామ్ అనే వ్యక్తిని ముందు గా జనసేన పార్టీ నుండి ఆపార్టీ అధిష్టానం సస్పెండ్ చేయాలని ఏనుగు పల్లి కృష్ణ డిమాండ్ చేశారు.ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని హెచ్చరించారు.మొత్తం మీద, న్యాయం కోసం వెళ్లిన మహిళలు అవమానాన్ని ఎదుర్కోవడం సామాజికంగా ఆందోళన కలిగించే విషయం. బాధితులకు న్యాయం జరిగేలా అధికారులు చర్యలు తీసుకోవాలనే డిమాండ్లు వ్యక్తమవుతున్నాయి.

