Homeఆంధ్రప్రదేశ్కాకినాడగొల్లపాలెం రక్షిత మంచినీటి చెరువు చేపల వేలం రికార్డు ధరకు

గొల్లపాలెం రక్షిత మంచినీటి చెరువు చేపల వేలం రికార్డు ధరకు

రూ.7.11 లక్షలకు ఎస్. జగదీష్  కు చేపల హక్కులు

జిల్లాపరిషత్‌కు భారీ ఆదాయం

16 మంది డిపాజిట్ దారుల పోటీతో మండల చరిత్రలోనే అత్యధిక వేలంపాట

కాజులూరు, పెన్‌పవర్, జూలై 20:
ఎన్నో రాజకీయ చర్చలు, వాయిదాలు, ఆసక్తికర పరిణామాల మధ్య ఎట్టకేలకు కాజులూరు మండలంలోని గొల్లపాలెం రక్షిత మంచినీటి చెరువులో సహజసిద్ధంగా పెరిగిన చేపల బహిరంగ వేలంపాట సోమవారం విజయవంతంగా ముగిసింది. 16 ఎకరాల విస్తీర్ణం గల ఈ చెరువులో చేపల వేట హక్కులను కాజులూరు గ్రామానికి చెందిన సాదా జగదీష్ రూ. 7 లక్షల 11 వేల అత్యధిక ధరకు దక్కించుకోవడం విశేషం. మండల చరిత్రలోనే ఇంత అధిక మొత్తానికి చేపల వేలంపాట జరగడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.
పారదర్శకంగా వేలంపాట నిర్వహణ
కాజులూరు మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవో జె. రాంబాబు, జిల్లా పరిషత్ రెవెన్యూ అధికారి కె. శ్రీనివాసరావు, వ్యవసాయ అధికారి పద్మలత తదితర అధికారుల ఆధ్వర్యంలో వేలంపాట నిర్వహించారు. ఇందులో మొత్తం 16 మంది డిపాజిట్ దారులు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరి నుంచి రూ.9 వేల డిపాజిట్‌తో పాటు సాల్వెన్సీ పత్రాలు స్వీకరించి, నిర్దేశిత నిబంధనల మేరకు బహిరంగంగా పాట నిర్వహించారు.


ప్రభుత్వానికి భారీ ఆదాయం
గతంలో ఇదే చెరువులో చేపల వేలంపాట కేవలం రూ.1.80 లక్షలకు ముగిసిందని అధికారులు తెలిపారు. ఈసారి పోటీ వాతావరణం నెలకొనడంతో వేలం ధర ఏకంగా రూ.7.11 లక్షలకు చేరింది. దీంతో గతంతో పోలిస్తే దాదాపు రూ.5 లక్షలకు పైగా అదనపు ఆదాయం జిల్లాపరిషత్ ఖజానాకు చేరనుంది.
ప్రభుత్వ ఆస్తులను పారదర్శకంగా, పోటీ పద్ధతిలో వినియోగంలోకి తీసుకురావడం ద్వారా ప్రభుత్వానికి అధిక ఆదాయం సమకూరుతుందనే విషయాన్ని ఈ వేలంపాట మరోసారి నిరూపించింది. ప్రజల ఆస్తులైన చెరువులు, వనరులను సమర్థంగా నిర్వహిస్తే స్థానిక సంస్థలకు ఆర్థిక బలం చేకూరుతుందని అధికారులు అభిప్రాయపడుతున్నారు.
చెరువులో భారీగా చేపల నిల్వలు
స్థానికుల అంచనాల ప్రకారం చెరువులో సుమారు 10 టన్నులకు పైగా చేపల నిల్వలు ఉన్నట్లు సమాచారం. టన్ను చేపల విలువ సగటున రూ.1.30 లక్షల వరకు ఉండవచ్చని డిపాజిట్ దారులు అంచనా వేస్తున్నారు. దీంతో చేపల వేట హక్కులు పొందిన సతీష్‌కు కూడా మంచి లాభాలు వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు.
గ్రామస్తుల్లో ఆసక్తి
చేపల వేటకు సంబంధించి త్వరలోనే అధికారిక ఉత్తర్వులు జారీ చేయనున్నట్లు అధికారులు తెలిపారు. మూడు రోజుల గడువులోపు చేపలు పట్టుకోవాలని, చెరువుకు ఎటువంటి నష్టం కలగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.
గొల్లపాలెం చెరువులో చేపల వేట ప్రారంభం కోసం గ్రామస్తులు, చేపల ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎన్నో పరిణామాల తర్వాత విజయవంతంగా ముగిసిన ఈ వేలంపాట ప్రభుత్వానికి ఆదాయం పెంచడమే కాకుండా, స్థానిక వనరుల సద్వినియోగానికి ఆదర్శంగా నిలిచిందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
ఈ కార్యక్రమంలో ఎంపీడీవో జె. రాంబాబు, జిల్లా పరిషత్ రెవెన్యూ అధికారి కె. శ్రీనివాసరావు, పంచాయతీ కార్యదర్శి సీహెచ్.సూర్యప్రకాశరావు, ఏవో పద్మలత, ఆర్‌డబ్ల్యూఎస్ జేఈ రూప,డిప్యూటీ ఎంపీడీవో సత్యనారాయణ తదితర అధికారులు, డిపాజిట్ దారులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular