- మోదకొండమ్మ జాతర వాయిదా.. కక్ష సాధింపేనా?
జాతర తేదీల మార్పు..రాజకీయ రంగు పులుముకుంటోందా?
గూడెం కొత్త వీధి,పెన్ పవర్, ఏప్రిల్ 16: గిరిజనుల ఆరాధ్య దైవమైన శ్రీ శ్రీ మోదకొండమ్మ తల్లి జాతర మహోత్సవ తేదీల విషయంలో కూటమి ప్రభుత్వం రాజకీయ కక్ష సాధింపునకు దిగిందని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కోశాధికారి, దామనపల్లి పంచాయతీ మాజీ సర్పంచ్ కే. రామకృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు.గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రతి సంవత్సరం మోదకొండమ్మ తల్లి పుట్టినరోజు సందర్భంగా జాతర మహోత్సవ తేదీలను ఆలయ కమిటీ చైర్మన్, కమిటీ సభ్యులు, గిరిజన పెద్దలు, మేధావులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, అన్ని రాజకీయ పార్టీల నాయకులు పరస్పర చర్చల ద్వారా ఖరారు చేస్తారని చెప్పారు. అదే సంప్రదాయాన్ని కొనసాగిస్తూ ఈ సంవత్సరం కూడా తేదీలు నిర్ణయించినప్పటికీ, గిరిజన మంత్రి సంధ్యారాణి ఏకపక్ష నిర్ణయం తీసుకొని జాతరను వాయిదా వేయడం గిరిజనుల మనోభావాలను దెబ్బతీసిందని విమర్శించారు.గిరిజన సంప్రదాయాలను అవమానించే విధంగా మంత్రి వ్యాఖ్యలు చేయడం బాధాకరమని, పాడేరు ఎమ్మెల్యే మత్యారాస విశ్వేశ్వరరాజు ఆధ్వర్యంలో పనిచేస్తున్న ఆలయ కమిటీని పక్కన పెట్టడం సరైంది కాదన్నారు. రెండు నెలల ముందే తేదీలు ఖరారైనప్పటికీ అప్పట్లో అభ్యంతరం వ్యక్తం చేయని ప్రభుత్వం, పండుగకు కేవలం 20 రోజులు మాత్రమే మిగిలి ఉన్న సమయంలో నిర్ణయం మార్చడం వెనుక రాజకీయ ప్రయోజనాలే ఉన్నాయని ఆరోపించారు.ప్రజా సమస్యలను పక్కన పెట్టి వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలపై కక్ష సాధింపు చర్యలు కొనసాగిస్తున్న కూటమి ప్రభుత్వం, ఇప్పుడు దేవాలయాల వ్యవహారాల్లో కూడా జోక్యం చేసుకోవడం సమంజసం కాదన్నారు. గిరిజన ఆచారాలను తుంగలో తొక్కే ప్రయత్నం చేస్తే ప్రజలతో పాటు అమ్మవారి ఆగ్రహాన్నీ ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు.ఇప్పటికైనా ఆలయ కమిటీ నిర్ణయించిన తేదీల ప్రకారమే మోదకొండమ్మ మహోత్సవాలు నిర్వహించాలని, లేని పక్షంలో ప్రభుత్వం భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని రామకృష్ణ స్పష్టం చేశారు.

