ePaper
Saturday, April 11, 2026
ePaper
Homeఆంధ్రప్రదేశ్గంగవరం ఆమదాల బంధ పరిసరాల్లో పెద్దపులి సంచారం

గంగవరం ఆమదాల బంధ పరిసరాల్లో పెద్దపులి సంచారం

పట్టుకునేందుకు అటవీ శాఖ సిబ్బంది విశ్వ ప్రయత్నాలు

అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్న అటవీ శాఖ సిబ్బంది

గంగవరం -పెన్ పవర్

గంగవరం మండలంలోని అడవి ప్రాంతాల్లో పెద్దపులి సంచారం కొనసాగుతుండడంతో స్థానికుల్లో భయాందోళనలు నెలకొన్నాయి. పులిని పట్టుకునేందుకు అటవీ శాఖ అధికారులు ముమ్మరంగా సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు.
గొరగుమ్మి, వేములోవ, ఉయ్యాలమడుగు రిజర్వ్ ఫారెస్ట్ ప్రాంతాల్లో పులి కదలికలను అధికారులు రేడియో ట్రాకింగ్ ద్వారా గుర్తించారు. ఏపీసీసీఎఫ్ శాంతి ప్రియ పాండే ఆధ్వర్యంలో మంగళవారం ఉదయం నుంచే సుమారు 60 మంది సిబ్బంది ఐదు బృందాలుగా విడిపోయి గాలింపు చర్యలు చేపట్టారు.సోమవారం రాత్రి వేములోవ ప్రాంతంలో కనిపించిన పులి, ఉయ్యాలమడుగు, గొరగుమ్మి, పెదగార్లపాడు శివారు ప్రాంతాల మీదుగా గంగవరం శివారు పోతురాజు బాబు గుడి సమీప అటవీ ప్రాంతానికి చేరినట్లు అధికారులు తెలిపారు. సాయంత్రం 6:30 గంటల సమయంలో గంగవరం–కొత్తపల్లి ప్రధాన రహదారి దాటి దొరమామిడి జంక్షన్ వైపు కదిలినట్లు గుర్తించారు.ప్రస్తుతం దొరమామిడి సమీపంలోని కొండ ప్రాంతంలో, ఒక చింత చెట్టు కింద పులి విశ్రాంతి తీసుకుంటున్నట్లు డ్రోన్ కెమెరా ద్వారా గుర్తించారు. ప్రధాన రహదారికి సుమారు 200 మీటర్ల దూరంలోనే పులి ఉండటంతో అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. షూటర్లను కూడా మోహరించారు.ఈ సందర్భంగా సబ్ డీఎస్ఓ వెంకట సుబ్బారెడ్డి మాట్లాడుతూ, గొరగుమ్మి సమీపంలో ఒక ఆవు దూడపై పులి దాడి చేసినట్లు తెలిపారు. గ్రామస్తుల భద్రత దృష్ట్యా పులి సంచరిస్తున్న ప్రాంతాలకు ఎవరినీ వెళ్లనివ్వకుండా చర్యలు తీసుకున్నామని చెప్పారు.అర్ధరాత్రి అయినా సరే పులిని బంధించేందుకు అన్ని చర్యలు చేపడుతున్నామని అధికారులు స్పష్టం చేశారు.

 

ఈ ఆపరేషన్‌లో రాజమహేంద్రవరం సీసీఎఫ్ శ్రీకంఠనాథ్ రెడ్డి, రంపచోడవరం డి ఎఫ్ ఓ శివకుమార్, కాకినాడ, చింతూరు డీఎఫ్ఓలు రామచంద్రరావు, రవీంద్రనాథ్ రెడ్డి, సబ్ డీఎఫ్‌ఓ సుబ్బారెడ్డి, అనూష తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular