ePaper
Friday, May 1, 2026
ePaper
Homeఆంధ్రప్రదేశ్కాకినాడగొల్లపాలెం ట్రాఫిక్‌ గందరగోళం

గొల్లపాలెం ట్రాఫిక్‌ గందరగోళం

📰 Generate e-Paper Clip

– రోడ్డు ఉందా? పార్కింగ్‌ స్థలమా?

కాజులూరు, ఏప్రిల్ 8 పెన్ పవర్:
మండల పరిధిలోని గొల్లపాలెం–ద్రాక్షారామం ప్రధాన రహదారి ప్రస్తుతం ట్రాఫిక్‌ నరకంగా మారింది. ఒకప్పుడు విశాలంగా మూడు భారీ వాహనాలు సులభంగా వెళ్లగలిగిన ఈ రోడ్డు, ఇప్పుడు అక్రమ పార్కింగ్‌లు, ఆక్రమణలతో ఇరుక్కుపోయి ప్రజలకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తోంది.
రోడ్డుకు ఇరువైపులా వ్యాపార దుకాణాలు విస్తరించడంతో పాటు వాహనదారులు ఇష్టారాజ్యంగా రోడ్డుపైనే వాహనాలు నిలిపివేయడం ట్రాఫిక్‌ సమస్యను మరింత తీవ్రమైంది. ముఖ్యంగా కాజులూరు, ఆర్యవటం, గొల్లపాలెం మార్కెట్ సెంటర్, మణిపలావ్ సెంటర్ ప్రాంతాల్లో సాయంత్రం వేళ ప్రయాణం అంటే ప్రజలు భయపడే పరిస్థితి నెలకొంది.
ఇటీవల కాకినాడ–హైదరాబాద్ మార్గంలో ప్రైవేట్ వాహనాల రాకపోకలు పెరగడంతో ఈ రహదారి మరింత ఒత్తిడిని ఎదుర్కొంటోంది. దీనికితోడు వారాంతపు సంత ప్రభావం తగ్గినా, కొత్తగా మొబైల్ వ్యాపారాలు, రోడ్డు పక్కన షాపుల విస్తరణతో పరిస్థితి అదుపు తప్పుతోంది.అక్రమ నిర్మాణాలు, రోడ్డు ఆక్రమణలు పరిస్థితిని మరింత దిగజార్చుతున్నాయి. ప్రభుత్వ, ఆర్‌అండ్‌బి స్థలాలు కనిపిస్తే చాలు రాత్రికి రాత్రే షాపులు పుట్టగొడుగుల్లా పెరుగుతున్నాయి. డ్రైనేజీ కాలువలపైనా సిమెంట్ బల్లలు వేసి వ్యాపారం సాగించడం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. రోడ్డుకు ఇరువైపుల కనీసం మూడు గజాల ఖాళీ లేకపోవడం గమనార్హం.
ఈ నిర్లక్ష్యం కారణంగా ప్రమాదాలు కూడా పెరుగుతున్నాయి. బుధవారం ఉదయం శలపాక సెంటర్ సమీపంలో ఓ కూరగాయల వ్యాపారిని వాహనం ఢీకొట్టడంతో అతను తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలించారు.
ఇంత జరుగుతున్నా సంబంధిత శాఖలు మౌనంగా ఉండటం స్థానికుల్లో ఆగ్రహానికి దారితీస్తోంది. ప్రత్యేకాధికారుల పాలనలో కూడా సమస్యలపై ఎలాంటి చర్యలు లేకపోవడం, అధికారులు చూస్తూ చూస్తూ ఊరుకుంటున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.


“గొల్లపాలెం ట్రాఫిక్ సమస్యకు పరిష్కారం చూపేది ఎవరు? ఎవరిని వేడుకోవాలి?” అంటూ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే అక్రమ పార్కింగ్‌లపై చర్యలు తీసుకోవడం, రోడ్డు ఆక్రమణలు తొలగించడం, ట్రాఫిక్ నియంత్రణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular