రూ.50 లక్షల అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవం..
రూ.16.30 లక్షల పనులకు శంకుస్థాపన
నర్సీపట్నం, జూలై 26 (పెన్ పవర్):
నర్సీపట్నం పట్టణంలోని 26, 28వ వార్డుల్లో శనివారం ‘ఇంటింటికీ తెలుగుదేశం’ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు సతీమణి, 26వ వార్డు కౌన్సిలర్ చింతకాయల పద్మావతి, టిడిపి పట్టణ అధ్యక్షుడు చింతకాయల రాజేష్ ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది. ముందుగా స్థానిక రామాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం నాయకులు ఇంటింటికీ వెళ్లి గత రెండేళ్లలో ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై ప్రజలకు వివరించి కరపత్రాలు పంపిణీ చేశారు. స్థానికుల సమస్యలను అడిగి తెలుసుకుంటూ పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

ఈ సందర్భంగా 26వ వార్డు పరిధిలో విఎంఆర్డిఏ, 15వ ఆర్థిక సంఘం నిధులతో సుమారు రూ.50 లక్షల వ్యయంతో నిర్మించిన మూడు సీసీ రోడ్లు, కాలువల నిర్మాణ పనులను ప్రారంభించారు. అనంతరం 28వ వార్డులో రూ.16.30 లక్షల అంచనా వ్యయంతో చేపట్టనున్న రెండు సీసీ రోడ్లు, డ్రైనేజీ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా చింతకాయల పద్మావతి మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు నాయకత్వంలో నర్సీపట్నం పట్టణం వేగంగా అభివృద్ధి చెందుతోందని అన్నారు. గత రెండేళ్లలో ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించేందుకే ‘ఇంటింటికీ తెలుగుదేశం’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో వార్డు అభివృద్ధికి తగిన నిధులు అందలేదని పేర్కొన్న ఆమె, కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత స్పీకర్ అయ్యన్నపాత్రుడు చొరవతో నర్సీపట్నం మున్సిపాలిటీకి భారీగా నిధులు మంజూరయ్యాయని చెప్పారు. విఎంఆర్డిఏ నుంచి రూ.4.11 కోట్లు, మున్సిపాలిటీకి మొత్తం రూ.32 కోట్లు, ఇంటింటికీ తాగునీటి సరఫరా పథకం కోసం రూ.185 కోట్లు మంజూరైనట్లు వెల్లడించారు. పట్టణంలో 700 కొత్త ఎల్‌ఈడీ బల్బులు ఏర్పాటు చేయడంతో పాటు 1,075 పాత వీధి దీపాలను మార్చి కొత్తవాటిని ఏర్పాటు చేశామని, 140 కొత్త విద్యుత్ స్తంభాలను కూడా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 26వ వార్డు అభివృద్ధికి రూ.1.10 కోట్లు, 28వ వార్డు అభివృద్ధికి రూ.2.20 కోట్లు కేటాయించినట్లు చెప్పారు. ప్రజల నుంచి వచ్చిన వినతుల మేరకు డ్రైన్లు, కల్వర్టులు, రోడ్ల నిర్మాణానికి మరిన్ని నిధులు తీసుకువస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ గవిరెడ్డి వెంకటరమణ, టిడిపి పట్టణ ప్రధాన కార్యదర్శి లాలం మురళి, నూకాంబిక అమ్మవారి ఆలయ చైర్మన్ కొరుప్రోలు శ్రీనివాస్, 28వ వార్డు ఇంచార్జ్ డబ్బీరు శ్రీకాంత్, వార్డు నాయకులు, మహిళలు, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

