నర్సీపట్నం, జూలై 27 (పెన్ పవర్):
అనకాపల్లి జిల్లా పోలీసు సూపరింటెండెంట్ ఆదేశాల మేరకు మహిళల భద్రత కోసం చేపట్టిన “అభయ – మీ భద్రత… మా బాధ్యత” కార్యక్రమంలో భాగంగా నర్సీపట్నం పాలిటెక్నిక్ కళాశాలలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. టౌన్ ఎస్.ఐ జి. ఉమా మహేశ్వరరావు విద్యార్థులకు మహిళల భద్రత, చట్టపరమైన రక్షణ, అత్యవసర సేవలు, సైబర్ నేరాల నివారణ, సోషల్ మీడియా వినియోగంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. అత్యవసర పరిస్థితుల్లో 112, మహిళా హెల్ప్‌లైన్ 181, సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ 1930 సేవలను వినియోగించుకోవాలని సూచించారు. అలాగే మాదకద్రవ్యాలు, ఆన్‌లైన్ బెట్టింగ్, గేమింగ్ యాప్‌ల వ్యసనాలకు దూరంగా ఉండాలని, అనుమానాస్పద ఫోన్ కాల్స్, లింకులు, ఓటీపీలు, బ్యాంకు వివరాలను ఎవరికీ వెల్లడించవద్దని విద్యార్థులకు సూచించారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్, అధ్యాపకులు, విద్యార్థులు, విద్యార్థినులు, టౌన్ పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

