ePaper
Wednesday, April 29, 2026
ePaper
Homeఆంధ్రప్రదేశ్ప్రకాశంతీరనున్న కనిగిరి ప్రాంత వాసుల కల

తీరనున్న కనిగిరి ప్రాంత వాసుల కల

📰 Generate e-Paper Clip

కనిగిరి వరకు పూర్తి అయిన రైల్వే లైన్ పనులు
గుంటూరు–కనిగిరి రూట్‌పై ప్యాసింజర్ రైలు ప్రతిపాదనలు
వారంలో ఆరు రోజుల సర్వీస్‌కు ప్రణాళిక
ట్రయల్ రన్ పూర్తి.. అధికారిక ప్రకటన కోసం ఎదురుచూపులు
పశ్చిమ ప్రకాశం ప్రజలకు మెరుగైన కనెక్టివిటీ ఆశలు

బ్యూరో రిపోర్ట్ | పెన్ పవర్ | ఒంగోలు | ఏప్రిల్ 29

పశ్చిమ ప్రకాశం, మార్కాపురం జిల్లాలకు చెందిన ప్రజలు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న రైలు సౌకర్యం ఇక అందుబాటులోకి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా కనిగిరి ప్రాంత ప్రజల రవాణా అవసరాలను తీర్చే దిశగా గుంటూరు నుంచి కనిగిరి వరకు ప్యాసింజర్ రైలు నడిపేందుకు కీలక చర్యలు ప్రారంభమయ్యాయి. నడికుడి–శ్రీకాళహస్తి కొత్త రైల్వే లైన్ పనులు వేగంగా కొనసాగుతున్న నేపథ్యంలో కనిగిరి వరకు ట్రాక్ నిర్మాణం పూర్తయింది. దీంతో ఆ ప్రాంతానికి రైలు సేవలను ప్రారంభించాలనే డిమాండ్ స్థానిక ప్రజాప్రతినిధులు, ప్రజల నుంచి బలంగా వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో గుంటూరు నుంచి గుండ్లకమ్మ మీదుగా కనిగిరి వరకు ప్యాసింజర్ రైలు నడపాలని రైల్వే అధికారులకు ప్రతిపాదనలు పంపారు.తాజా ప్రణాళిక ప్రకారం ఈ రైలును వారంలో ఆరు రోజుల పాటు నడిపేలా ప్రతిపాదించారు. గుంటూరు నుంచి ఉదయం 8:30 గంటలకు బయల్దేరే ఈ రైలు మధ్యాహ్నం 1 గంటకు కనిగిరి చేరుకునేలా షెడ్యూల్ రూపొందించారు. తిరుగు ప్రయాణంలో మధ్యాహ్నం 2 గంటలకు కనిగిరి నుంచి బయల్దేరి రాత్రి 7 గంటలకు గుంటూరు చేరుకునేలా ప్రణాళిక సిద్ధమైంది.ఈ ప్రతిపాదనలపై రైల్వే అధికారులు సానుకూలంగా స్పందించినట్లు సమాచారం.

త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇప్పటికే కనిగిరి రైల్వే స్టేషన్ పనులు పూర్తి కావడం, ప్రయాణికులకు అవసరమైన సౌకర్యాలు అందుబాటులోకి రావడం ఈ ప్రక్రియను మరింత సులభతరం చేస్తున్నాయి. అంతేకాకుండా ట్రయల్ రన్ కూడా విజయవంతంగా పూర్తి కావడం కీలక మైలురాయిగా భావిస్తున్నారు.ఈ రైలు సేవ ప్రారంభమైతే కనిగిరి ప్రాంతంతో పాటు పొదిలి, దర్శి ప్రాంతాల ప్రజలకు ప్రయాణ సౌకర్యం గణనీయంగా మెరుగవుతుంది. ముఖ్యంగా గుంటూరు వంటి కీలక నగరంతో కనెక్టివిటీ పెరగడం ద్వారా విద్య, ఉపాధి, వ్యాపార అవకాశాలు కూడా విస్తరించే అవకాశాలు ఉన్నాయి.ఇప్పటికే ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, కనిగిరి ఎమ్మెల్యే ముక్కు ఉగ్రనరసింహారెడ్డి ఈ అంశంపై రైల్వే అధికారులతో చర్చలు జరిపి వేగవంతం చేయాలని కోరారు. వారి ప్రయత్నాలు ఫలించి ఈ ప్రాజెక్ట్ తుది దశకు చేరుకుందని భావిస్తున్నారు. మొత్తం మీద పశ్చిమ ప్రకాశం, మార్కాపురం జిల్లాల ప్రజల ఎన్నో ఏళ్ల కల సాకారం కానుంది. రాబోయే రోజుల్లో అధికారిక ప్రకటన వెలువడితే ఈ ప్రాంత అభివృద్ధికి ఇది కీలక మలుపు కావడం ఖాయం.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular