ePaper
Tuesday, April 14, 2026
ePaper
Homeఆంధ్రప్రదేశ్అమరావతిఏపీలో మరో 30 ఇండస్ట్రియల్ క్లస్టర్లకు గ్రీన్ సిగ్నల్

ఏపీలో మరో 30 ఇండస్ట్రియల్ క్లస్టర్లకు గ్రీన్ సిగ్నల్

మూడు జాతీయ ఇండస్ట్రియల్ కారిడార్లను ఆధారంగా చేసుకుని ఆంధ్రప్రదేశ్‌లో మరో 30 కొత్త ఇండస్ట్రియల్ క్లస్టర్ల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే ఉన్న 20 క్లస్టర్లకు ఇవి జతకావడంతో మొత్తం సంఖ్య 50కి చేరుకోనుండగా, భారీ భూసేకరణతో పాటు పోర్ట్ ఆధారిత పరిశ్రమలకు కొత్త ఊపు రానుందనే అంచనాలు వ్యక్తమవుతున్నాయి.

మూడు కారిడార్ల వెంట 30 కొత్త క్లస్టర్ల ప్రతిపాదన
1.31 లక్షల ఎకరాల భూమి గుర్తించిన అధికారులు
పోర్ట్ ఆధారిత పరిశ్రమలకు ప్రత్యేక ప్రాధాన్యం
జిల్లాల వారీగా క్లస్టర్ల పంపిణీపై స్పష్టత
కేంద్ర నిధులతో ఏపీ ఇండస్ట్రియల్ బూస్ట్

స్టేట్ బ్యూరో, పెన్ పవర్, అమరావతి, ఏప్రిల్ 14:

ఆంధ్రప్రదేశ్‌ను దేశంలోనే ప్రధాన తయారీ, ఎగుమతి కేంద్రంగా తీర్చిదిద్దే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రణాళికకు శ్రీకారం చుట్టింది. రాష్ట్రం గుండా వెళ్లే విశాఖపట్నం–చెన్నై, చెన్నై–బెంగళూరు, హైదరాబాద్–బెంగళూరు జాతీయ ఇండస్ట్రియల్ కారిడార్ల వెంట మరో 30 కొత్త ఇండస్ట్రియల్ క్లస్టర్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇప్పటికే అభివృద్ధి చేసిన 20 క్లస్టర్లకు ఇవి జతకావడంతో మొత్తం సంఖ్య 50కి చేరనుంది. ఈ క్లస్టర్ల కోసం అధికారులు సుమారు 1.31 లక్షల ఎకరాల భూమిని గుర్తించినట్లు సమాచారం. శ్రీకాకుళం నుంచి కర్నూలు వరకు వివిధ జిల్లాల్లో పరిశ్రమల విస్తరణకు అనుగుణంగా స్థలాలను ఎంపిక చేశారు. ముఖ్యంగా విశాఖ, తిరుపతి, చిత్తూరు, అనంతపురం, కడప జిల్లాల్లో అధిక సంఖ్యలో క్లస్టర్లు ప్రతిపాదించబడటం గమనార్హం. ప్రభుత్వ వర్గాల సమాచారం ప్రకారం, ఈ కొత్త క్లస్టర్లలో పెద్దపీట మారిటైమ్, లాజిస్టిక్స్, ఫుడ్ ప్రాసెసింగ్, ఎలక్ట్రానిక్స్, ఎగుమతి ఆధారిత తయారీ పరిశ్రమలకు ఉండనుంది. తీరప్రాంతానికి సమీపంగా ఉన్న భూములను పోర్ట్ ఆధారిత పరిశ్రమల కోసం వినియోగించాలనే వ్యూహంతో ప్రభుత్వం ముందుకెళ్తోంది. ఈ ప్రణాళిక ద్వారా రామాయపట్నం, మచిలీపట్నం, మూలపేట, కృష్ణపట్నం వంటి పోర్టులకు మరింత పారిశ్రామిక ప్రాధాన్యం దక్కే అవకాశం ఉంది.మరోవైపు, ముంపు ప్రాంతాలు మరియు తీర ప్రాంతాల్లో ఇప్పటికే గుర్తించిన భూములను క్లస్టర్ల అభివృద్ధికి అనుసంధానం చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. కేంద్రానికి ప్రతిపాదనలు పంపిన రాష్ట్ర ప్రభుత్వం, అవసరమైన నిధుల్లో కొంత భాగాన్ని కేంద్రం నుంచి, మిగిలిన వాటాను రాష్ట్ర వాటాగా సమీకరించేలా కార్యాచరణ రూపొందిస్తోంది. ఈ క్లస్టర్లు పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే, రాష్ట్రంలో భారీ పెట్టుబడులు, లక్షల ఉద్యోగ అవకాశాలు, ఎగుమతుల పెరుగుదల, పోర్ట్ ఆధారిత ఆర్థిక వృద్ధికి ఇది గేమ్ ఛేంజర్‌గా మారే అవకాశముందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి.

 

RELATED ARTICLES
- Advertisment -

Most Popular