కేబినెట్ అజెండా లీక్‌పై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యక్తం చేసిన తీవ్ర అసంతృప్తి, ఏపీ మంత్రివర్గంలో త్వరలోనే మార్పుచేర్పులు జరిగే అవకాశాలపై రాజకీయ వర్గాల్లో చర్చను వేడెక్కిస్తోంది. మున్సిపల్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పనితీరు, క్రమశిక్షణ, ప్రజా మైలేజ్ ఆధారంగా కొత్త సమీకరణాలకు ఆయన శ్రీకారం చుట్టే అవకాశం ఉందన్న అంచనాలు బలపడుతున్నాయి.
అజెండా లీక్‌తో మంత్రులపై సీఎం ఫైర్
పనితీరు రిపోర్టులతో కేబినెట్ మార్పుల కసరత్తు
మున్సిపల్ ఎన్నికల ముందు కొత్త టీమ్ సంకేతాలు
లోకేష్-పవన్ సూచనలకు పెరిగిన ప్రాధాన్యం
సీనియర్లకు షాక్.. యువ నేతలకు ఛాన్స్?
విజయవాడ, పెన్ పవర్, ఏప్రిల్ 14:
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రులపై ప్రదర్శిస్తున్న అసహనం, కేవలం పరిపాలనా క్రమశిక్షణకే పరిమితం కాకుండా త్వరలో జరగబోయే మంత్రివర్గ మార్పులకు సంకేతంగా మారింది. ఇటీవల సచివాలయంలో జరిగిన కేబినెట్ సమావేశంలో అజెండాలోని కీలక అంశాలు అధికారిక ప్రకటనకు ముందే మీడియాలో రావడంపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇలాంటి లీకులు ప్రభుత్వ గోప్యతను దెబ్బతీస్తాయని, ఇది పునరావృతమైతే కఠిన చర్యలు తప్పవని మంత్రులకు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ హయాంలో బడ్జెట్ లీక్ కారణంగా మొత్తం కేబినెట్‌ను రద్దు చేసిన సంఘటనను చంద్రబాబు గుర్తు చేయడం రాజకీయంగా పెద్ద సందేశంగా మారింది. దీంతో మంత్రులలో ఒక రకమైన అప్రమత్తత పెరిగినట్లు తెలుస్తోంది. ప్రభుత్వం రెండేళ్ల పాలనకు చేరువవుతున్న నేపథ్యంలో, మంత్రుల పనితీరుపై సమగ్ర సమీక్ష జరుగుతోందని సమాచారం. శాఖల అమలు, ప్రజల్లో ఇమేజ్, కేంద్ర పథకాల అమలులో చురుకుదనం, క్షేత్రస్థాయి సమన్వయం వంటి అంశాలపై సీఎం ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ఆశించిన స్థాయిలో ఫలితాలు ఇవ్వని వారికి బదులుగా చురుకైన నేతలకు అవకాశం కల్పించే ఆలోచనలో అధిష్టానం ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు రాబోయే మున్సిపల్ ఎన్నికలను సెమీఫైనల్‌గా భావిస్తున్న టీడీపీ అధిష్టానం, ప్రజల్లో మంచి స్పందన ఉన్న నేతలను ముందుకు తేవాలనే వ్యూహంలో ఉంది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో సామాజిక సమీకరణాలు, కూటమి సమతుల్యం, యువ నేతలకు ప్రాధాన్యం వంటి అంశాలు మంత్రివర్గ మార్పుల్లో కీలకంగా మారే అవకాశం ఉంది. ఈసారి మార్పుల్లో మంత్రి నారా లోకేష్ సూచనలు, అలాగే కూటమి భాగస్వామ్య ధర్మం ప్రకారం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అభిప్రాయాలకు కూడా ప్రాధాన్యం దక్కవచ్చని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. సీనియర్లలో కొందరిని పార్టీ వ్యవహారాలకే పరిమితం చేసి, ఎన్నికల దృష్ట్యా కొత్త ముఖాలను కేబినెట్‌లోకి తీసుకురావడం ద్వారా స్పష్టమైన రాజకీయ సందేశం ఇవ్వాలన్నది చంద్రబాబు వ్యూహంగా కనిపిస్తోంది.

