- ప్రత్తిపాటి ఫౌండేషన్ వైద్య సేవల్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి.
- మెగా కంటి వైద్య శిబిరం ప్రచార పత్రాలు ఆవిష్కరించిన ప్రత్తిపాటి.
చిలకలూరిపేట రూరల్, పెన్ పవర్, మే 10 :
చిలకలూరిపేట : ప్రజారోగ్య పరిరక్షణే ధ్యేయంగా ప్రత్తిపాటి ఫౌండేషన్ అందిస్తున్న ఉచిత వైద్యసేవల్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని, ఉచిత వైద్య సేవలు అందిస్తూ, తమ జీవితాల్లో వెలుగులు నింపుతున్న స్వచ్చంధ, ఆరోగ్య సంస్థల్ని ప్రజలు ఆదరించాలని శాసనసభ్యులు, టీడీపీ జోనల్ కో ఆర్డినేటర్ ప్రత్తిపాటి పుల్లారావు సూచించారు.
ప్రత్తిపాటి ఫౌండేషన్ వైద్య శిబిరాల్ని ప్రజలు సద్వినియోగం చేసుకునేలా చూడండి..
స్వర్గీయ ఎన్టీఆర్ జయంతిని పురస్కరించుకొని ఈ నెల 29న నిర్వహించనున్న ఉచిత కంటి వైద్య శిబిరం ప్రచార పత్రాలను ఆదివారం ప్రత్తిపాటి ఆవిష్కరించారు. పట్టణంలోని ప్రత్తిపాటి గార్డెన్స్ లో 29వ తేదీ ఉదయం 9 గంటలకు ఉచిత వైద్య శిబిరం ప్రారంభమవుతుందన్నారు. ప్రత్తిపాటి ఫౌండేషన్, శంకర కంటి ఆసుపత్రి సంయుక్తంగా నిర్వహిస్తున్న 43వ ఉచిత మెగా కంటి వైద్య శిబిరాన్ని నియోజకవర్గ ప్రజలు సద్వినియోగం చేసుకునేలా చూడాల్సిన బాధ్యత ఫౌండేషన్ నిర్వాహకులు, కార్యనిర్వాహక సభ్యులదేనని ప్రత్తిపాటి స్పష్టంచేశారు. వైద్య శిబిరానికి వచ్చే రోగులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు. వైద్య సిబ్బంది సకాలంలో మెరుగైన వైద్యసేవలు అందించి ప్రజల మన్ననలు పొందాలని ప్రత్తిపాటి సూచించారు.
కార్యక్రమంలో టీడీపీ సమన్వయకర్త నెల్లూరి సదాశివరావు, మార్కెట్ యార్డ్ చైర్మన్ షేక్ కరిముల్లా, మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ తేళ్ల సుబ్బారావు, డాక్టర్ రామకృష్ణ, ఫౌండేషన్ నిర్వాహకులు కంచర్ల శ్రీనివాసరావు, టీడీపీ నాయకులు ముద్దన నాగేశ్వరరావు, తుపాకుల అప్పారావు, ఆర్.యం.పి. వైద్యులు మురళి, టీడీపీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

