చింతూరు, పెన్ పవర్, మే 11:
కూనవరం మండలం అభిచర్ల గ్రామ పరిసర ప్రాంతంలో సోమవారం విషాదకర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పంద్రాజుపల్లి గ్రామం నుంచి చింతూరు వైపు ఒకే బైక్‌పై ముగ్గురు యువకులు ప్రయాణిస్తుండగా, చింతూరు నుంచి కూనవరం వైపు కాంకర్ లోడ్‌తో వెళ్తున్న ట్రాక్టర్ ట్రక్‌ను వేగంగా వెళ్లి ఢీకొట్టినట్లు సమాచారం. ఈ ప్రమాదంలో పంద్రాజుపల్లి గ్రామానికి చెందిన వంజం లక్ష్మణ్ (24), ముల్లూరు గ్రామానికి చెందిన పద్ధం కార్తీక్ (25) ఘటన స్థలంలోనే మృతి చెందారు. మరో యువకుడు అభిచర్ల గ్రామానికి చెందిన శ్యామల భీమేశ్వరావు తీవ్రంగా గాయపడగా, స్థానికులు వెంటనే 108 అంబులెన్స్ ద్వారా కూనవరం సామాజిక ఆరోగ్య కేంద్రం కి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రికి రిఫర్ చేసినట్లు వైద్యులు తెలిపారు. ప్రమాద సమాచారం అందుకున్న కూనవరం పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాలను పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనతో పంద్రాజుపల్లి, ముల్లూరు గ్రామాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి.

