ePaper
Sunday, May 10, 2026
ePaper
Homeఆంధ్రప్రదేశ్ప్రజలకు ఉపయోగపడేదే నిజమైన అభివృద్ధి : ప్రత్తిపాటి

ప్రజలకు ఉపయోగపడేదే నిజమైన అభివృద్ధి : ప్రత్తిపాటి

📰 Generate e-Paper Clip

  • జనం అడిగింది చేయడంతో సరిపెట్టకుండా… అభివృద్ధిపై వారి సంతృప్తిని తెలుసుకోండి.
  • మున్సిపల్ కమిషనర్ సహా, కిందిస్థాయి సిబ్బంది క్షేత్రస్థాయి పరిశీలన తర్వాతే అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టాలి.
  • స్వచ్చాంధ్ర-స్వర్ణాంధ్ర లక్ష్యాల సాధనలో చిలకలూరిపేట ఉన్నత స్థానంలో ఉండాలి.
  • ప్రధాన చెరువు కట్టల్ని బలోపేతం చేసి వాకింగ్ ట్రాక్ లు నిర్మించండి.
  • స్టేడియం, ఆడిటోరియం నిర్మాణ అంచనాలు సిద్ధం చేయండి.
  • శ్మశానవాటికల్ని సకల హంగులతో మోడల్ పార్కుల్లా మార్చాలి.
  • శివారు ప్రాంత సమస్యలపై యంత్రాంగం ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి.
  • పట్టణంలో అభివృద్ధి పనుల్ని స్వయంగా పరిశీలించిన ప్రత్తిపాటి.

చిలకలూరిపేట రూరల్, పెన్ పవర్, మే 10 :

చిలకలూరిపేట : ప్రజలు, నాయకులు అడుగుతున్నారు.. అభివృద్ధి పనులు చేసేస్తున్నాం.. మన పని అయిపోయిందంటే కుదరదని, చేసే పనులు ప్రజలకు ఎంతమేర ఉపయోగపడుతున్నాయి.. వాటి వల్ల వారి సమస్యలు తీరాయా లేదా.. వారి సంతృప్తి స్థాయి పెరిగిందా లేదా అనే అంశాలపై కూడా యంత్రాంగం ప్రత్యేక దృష్టి పెట్టాలని శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు ఆదేశించారు.

ఆదివారం ఉదయం ఆయన పట్టణంలో జరుగుతున్న పలు అభివృద్ధి పనుల్ని స్వయంగా పరిశీలించారు. నూతనంగా నిర్మిస్తున్న చేపల మార్కెట్ ను పరిశీలించి, ఎప్పటిలోగా పూర్తిచేస్తారని గుత్తేదారుని ప్రశ్నించారు. నాణ్యతలో తేడా వస్తే చర్యలుంటాయని స్పష్టం చేశారు. మార్కెల్ నిర్మించి దుకాణాలు కేటాయించాక, మాంసం విక్రయదారులెవరూ రోడ్లపై అమ్మకాలు జరపడానికి వీల్లేదని ప్రత్తిపాటి సూచించారు. అధికారులు, నాయకులతో కలిసి క్షేత్రస్థాయికి వెళ్లిన ప్రత్తిపాటి. ఎక్కడికక్కడ ప్రజలతో మాట్లాడి, ప్రభుత్వం చేస్తున్న పనులు. అధికారులు, సిబ్బంది వ్యవహారశైలిపై ఆరాతీశారు. తాము కోరిన విధంగా రోడ్లు, డ్రైనేజ్ లనిర్మాణం చేపట్టడం లేదని, తాగునీటి సరఫరాలో ఇబ్బందులున్నాయన్న ప్రజా ఫిర్యాదులపై ప్రత్తిపాటి, యంత్రాంగంపై అసహనం వ్యక్తంచేశారు. ప్రజలు అడిగారు..చేసేశాం.. పని అయిపోయిందనే నిర్లిప్త ధోరణిని ప్రతి ఒక్కరూ వీడాలన్నారు. నిత్యం ఎక్కడ ఏం పనులు జరుగుతున్నాయి.. నిర్దేశించిన ప్రమాణాలు, లక్ష్యాలకు అనుగుణంగా, ప్రజలకు ఇబ్బంది లేకుండా జరుగుతున్నాయా లేదా అని పరిశీలించాలన్నారు. క్షేత్రస్థాయి పర్యటన అనంతరం ప్రత్తిపాటి క్యాంపు కార్యాలయంలో పట్టణాభివృద్ధిపై అన్నివిభాగాల అధికారులతో సమీక్ష నిర్వహించారు.

ఆక్రమణలు తొలగించి.. అవసరమైన చోట దుకాణాలు నిర్మించండి.
కళా మందిర్ కూడలిలోని ఆక్రమణలపై వచ్చిన ఫిర్యాదులపై స్పందించిన ప్రత్తిపాటి.. తక్షణమే అక్కడి ఆక్రమణలు తొలగించి, మున్సిపాలిటీ పరిధిలో దుకాణ సముదాయం నిర్మించాలన్నారు. ఆ దుకాణాల్సి స్థానికులకే కేటాయించి, సజావుగా వ్యాపారాలు చేసుకునేలా చూడాలన్నారు.

వాటర్ ట్యాంకును బాగు చేయించి, పరిసరాల్లో పార్కు నిర్మించండి
ఏలూరు డొంకలోని వాటర్ ట్యాంకును పరిశీలించిన ప్రత్తిపాటి.. వెంటనే దాని చుట్టూఉన్న కంపచెట్లు, చెత్తచెదారం తొలగించి బాగుచేయాలన్నారు. పరిసరాల్లో ఒక మంచి పార్కు నిర్మించాలని, అవసరమైతే పట్టణవాసులకోసం ప్రత్యేక వాకింగ్ ట్రాక్ కూడా ఏర్పాటు చేయాలన్నారు. పిల్లలు ఆడుకోవడానికి అవసరమైన క్రీడాపరికరాలు, సామగ్రిని కూడా అక్కడ అందుబాటులో ఉంచాలని ప్రత్తిపాటి సూచించారు. రాత్రి వేళల్లో వాటర్ ట్యాంకు పరిసరాల్లో పోలీస్ నిఘా పెంచాలని, ఆకతాయిలు.. మందుబాబులు ఆ పరిసరాల్లో కనిపించకుండా చూడాలన్నారు.
పట్ణణంలోని మూడు ప్రధాన మతాల శ్మశానవాటికల అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని ప్రత్తిపాటి అధికారుల్ని ఆదేశించారు. గతంలో టీడీపీ ప్రభుత్వంలో చేప్టటిన స్వర్గపురి తరహాలోనే అన్ని శ్మశానవాటికల్ని పూర్తిస్థాయిలో అధునికీరించాలని, సకల హంగులతో మినీ ఉద్యానవనాల్లా ఉండేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. అందుకోసం కేస్ స్టడీగా తెనాలి, గుంటూరు, విజయవాడల్లో అత్యాధునికంగా నిర్మించిన శ్మశానవాటికల్ని పరిశీలించి, తదనుగుణంగా పట్టణంలోని బరియల్ గ్రౌండ్స్ ను అభివృద్ధి చేయాలన్నారు.

ప్రత్యేక స్టేడియం.. ఆడిటోరియం నిర్మాణంపై దృష్టి పెట్టండి
పట్టణ సమీపంలోని 52 ఎకరాల టిడ్కో సముదాయం నుంచి వాటర్ ట్యాంకు మార్గంలో కల 12 ఎకరాల ప్రభుత్వ భూమిలో 5 ఎకరాలను మినీ స్టేడియం నిర్మాణానికి కేటాయించాలని ప్రత్తిపాటి అధికారుల్ని ఆదేశించారు. అందుకు అవసరమైన నిధుల్ని ప్రభుత్వం నుంచి తీసుకొచ్చేలా మున్సిపల్ కమిషనర్ ప్రత్యేక చొరవ చూపాలని ప్రత్తిపాటి సూచించారు. స్టేడియం నిర్మాణానికి సమాంతరంగా గతంలో ఆలోచన చేసిన ఆడిటోరియం నిర్మాణంపై కూడా యంత్రాంగం దృష్టి పెట్టాలన్నారు. అదే విధంగా పట్టణ ప్రధాన కూడళ్లు, ప్రధాన మార్గాల్లో ఎన్టీఆర్, చంద్రబాబు, లోకేశ్ ల పేర్లతో తెలుగు సంస్కృతీ సంప్రదయాల్ని ప్రతిబింబించేలా స్వాగత ద్వారాల నిర్మాణం చేపట్టాలని, ఇందుకు అవసరమైన నిధుల్ని కూడా ప్రభుత్వం నుంచి రాబట్టాలని ప్రత్తిపాటి సూచించారు.

చెరువుల ఆధునికీకరణతోపాటు.. వాకింగ్ ట్రాక్ లు నిర్మించండి
కెల్లంపల్లి వారి చెరువు, ఏలూరు డొంక నుంచి మానుకొండవారి పాలెం మార్గంలో డంప్ యార్డ్ పక్కనున్న మరో పెద్దచెరువును బాగుచేయాలని, పిచ్చిమొక్కలు తొలగించి, చెరువు కట్టల్ని పటిష్టపరిచి, వాటిపై వాకింగ్ ట్రాక్ లు నిర్మించాలని, సుందరీకరణకు అవసరమైన మంచి మొక్కలు నాటాలని ప్రత్తిపాటి ఆదేశించారు. అవకాశం ఉన్న చోట పట్టణంలోని ప్రధాన రోడ్ల మధ్యలో, రోడ్లకు ఇరువైపులా పచ్చదనం పెంచాలని, మొక్కల సంరక్షణ బాధ్యతను, ప్రజలు, ముఖ్యంగా వ్యాపారులకు అప్పగించాలని ప్రత్తిపాటి సూచించారు. పచ్చదనం.. పర్యావరణంలో భాగస్వాములయ్యే వారికి ప్రభుత్వరాయితీలు, ప్రోత్సాహకాలు అందించే ఆలోచన చేయాలన్నారు. పట్టణంలో ఎక్కడా ఓపెన్ డ్రైన్లు లేకుండా చూడాలని, మురుగునీరు, వర్షపు నీరు, బురద, చెత్త, ఇతర వ్యర్థాలు రోడ్లపై కనిపించడానికి వీల్లేదని, అపరిశుభ్రత, దుర్వాసనకు తావులేకుండా యంత్రాంగం ప్రతి వీధి, రోడ్డుపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. స్వచ్ఛాంద్ర-స్వర్ణాంధ్ర లక్ష్యసాధనలో చిలకలూరిపేట పట్టణం రాష్ట్రంలోనే ఉన్నతస్థానంలో ఉండాలని ప్రత్తిపాటి సూచించారు. మురికివాడల్లో అవసరమైన చోట, ప్రజలు కోరినచోట మాత్రమే సీసీ రోడ్లు, డ్రైన్ల నిర్మాణం చేపట్టాలన్నారు. ప్రజల సంతృప్తిస్థాయి పెరిగేలా అభివృద్ధి ఉండాలి కానీ, ఏదో మొక్కుబడిగా … వారు అడిగారు చేస్తున్నాం అన్నట్లు వ్యవహరిస్తే కుదరదని ప్రత్తిపాటి తేల్చిచెప్పారు. మెయిన్ రోడ్ నుంచి క్యాంపు కార్యాలయం వెళ్లే మార్గంలో ఇప్పుడున్న సీసీ రోడ్డు, డ్రైన్ల ఎత్తు పెంచి, పునర్నిర్మించాలని, అవసరమైతే ఆ రోడ్డును బీ.వో.టీ పద్దతిలో గుత్తేదారులకు అప్పగించాలని ప్రత్తిపాటి మున్సిపల్ కమిషనర్ కు సూచించారు.

ఈ కార్యక్రమంలో టిడిపి సమన్వయకర్త నెల్లూరి సదాశివరావు, మార్కెట్ యార్డ్ చైర్మన్ షేక్ కరిముల్లా, మున్సిపల్ మాజీ చైర్మన్ షేక్ రఫాని, పట్టణ ప్రధాన కార్యదర్శి మద్దుమాల రవి, మున్సిపల్ కమిషనర్ పతి శ్రీహరి, డిఇ అబ్దుల్ రహీమ్, టీడీపీ నాయకులు, మురకొండ మల్లిబాబు, బేరింగ్ మౌలాలి, అమరా రమాదేవి, అబ్దుల్లా, టీడీపీ నాయకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular