ePaper
Saturday, June 13, 2026
ePaper
Homeఆంధ్రప్రదేశ్పునర్విభజనతో రాయలసీమకు భారీ లాభం?..

పునర్విభజనతో రాయలసీమకు భారీ లాభం?..

📰 Generate e-Paper Clip

  • పెరగనున్న పార్లమెంట్ స్థానాలపై చర్చ
  • రాయలసీమ రాజకీయ బలం పెరుగుతుందా?.. 
  • కొత్త డీలిమిటేషన్ ప్రతిపాదనలపై ఆసక్తికర విశ్లేషణ
  • మళ్లీ తెరపైకి వచ్చిన పునర్విభజన చర్చ 
  • రాయలసీమకు అధిక ప్రయోజనం కలిగించే ప్రతిపాదనలు
  • మూడు ముక్కలుగా కీలక పార్లమెంట్ నియోజకవర్గాలు
  • ఉత్తరాంధ్రకు పరిమిత స్థాయిలోనే కొత్త సీట్లు
  • కోస్తాంధ్రలో యథాతథంగా కొనసాగే సీట్ల నిర్మాణం
  • భవిష్యత్ రాజకీయ సమీకరణాలపై ప్రభావం

 
దేశవ్యాప్తంగా లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన అంశం మరోసారి రాజకీయ చర్చలకు కేంద్రబిందువుగా మారింది. ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి విడుదల చేసిన తాజా వర్కింగ్ పేపర్‌లో పార్లమెంట్ స్థానాల పెంపు, నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణకు సంబంధించిన ప్రతిపాదనలు చోటుచేసుకోవడంతో వివిధ ప్రాంతాల్లో రాజకీయ సమీకరణాలపై చర్చ మొదలైంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో రాయలసీమ ప్రాంతానికి అత్యధిక ప్రయోజనం కలిగే అవకాశం ఉందన్న అంచనాలు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. ప్రస్తుత ప్రతిపాదనల ప్రకారం కడప, కర్నూలు, అనంతపురం, రాజంపేట వంటి విస్తారమైన పార్లమెంట్ నియోజకవర్గాలను మూడు భాగాలుగా విభజించే అవకాశం కనిపిస్తోంది. ఈ మార్పులు అమలైతే రాయలసీమలోనే అదనంగా ఎనిమిది లోక్‌సభ స్థానాలు పెరిగే అవకాశం ఉండటంతో భవిష్యత్‌లో రాష్ట్ర, జాతీయ రాజకీయాల్లో ఈ ప్రాంత ప్రభావం మరింత పెరగవచ్చని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

పెన్ పవర్ ప్రత్యేక కథనం  రాయలసీమ పెన్ పవర్ జూన్ 13: 

డీలిమిటేషన్ దిశగా అడుగులు.. రాయలసీమ రాజకీయ ప్రాధాన్యత మరింత పెరుగుతుందా? 

దేశ రాజకీయాల్లో ఎంతో కీలకమైన అంశమైన లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన మరోసారి చర్చనీయాంశంగా మారింది. గతంలో మహిళా రిజర్వేషన్ బిల్లుతో అనుసంధానంగా చర్చకు వచ్చిన ఈ ప్రక్రియ కొంతకాలం నిలిచిపోయినా, తాజాగా ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి విడుదల చేసిన వర్కింగ్ పేపర్‌తో మళ్లీ జాతీయ రాజకీయాల్లో ప్రాధాన్యత సంతరించుకుంది. దేశంలో పెరుగుతున్న జనాభా, పట్టణీకరణ, ప్రాంతీయ ప్రాతినిధ్యం వంటి అంశాలను దృష్టిలో ఉంచుకుని పార్లమెంట్ స్థానాల సంఖ్యను పెంచాల్సిన అవసరంపై కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే పలు దఫాలు సంకేతాలు ఇచ్చింది. ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి రూపొందించిన ప్రతిపాదనలు రాజకీయంగా ఆసక్తికర చర్చలకు దారితీస్తున్నాయి.ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించి ఈ నివేదికలో అత్యంత ప్రాధాన్యం పొందిన ప్రాంతం రాయలసీమ. ప్రస్తుతం ఉన్న విస్తారమైన పార్లమెంట్ నియోజకవర్గాల్లో కడప, కర్నూలు, అనంతపురం, రాజంపేట నియోజకవర్గాలు భౌగోళికంగా పెద్దవిగా ఉండటంతో వీటిని మూడు భాగాలుగా విభజించాలని సూచించినట్లు సమాచారం. ఈ ప్రతిపాదన అమలైతే ఒక్క రాయలసీమలోనే అదనంగా ఎనిమిది లోక్‌సభ స్థానాలు ఏర్పడే అవకాశం ఉంది.

రాజకీయంగా చూస్తే ఇది రాయలసీమ ప్రాధాన్యతను గణనీయంగా పెంచే పరిణామంగా మారవచ్చు. ఇప్పటికే రాష్ట్ర రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్న ఈ ప్రాంతం, అదనపు పార్లమెంట్ స్థానాల ద్వారా జాతీయ స్థాయిలో కూడా మరింత ప్రభావాన్ని చూపగలదని విశ్లేషకులు భావిస్తున్నారు. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వాల ఏర్పాటు, జాతీయ కూటముల రాజకీయాల్లో రాయలసీమ ప్రాతినిధ్యం మరింత పెరిగే అవకాశం ఉంది.ఉత్తరాంధ్ర విషయానికి వస్తే, విశాఖపట్నం పార్లమెంట్ నియోజకవర్గాన్ని మూడు భాగాలుగా విభజించే ప్రతిపాదనకు ప్రాధాన్యం లభించింది. విశాఖను గ్లోబల్ సిటీగా అభివృద్ధి చేసే లక్ష్యంతో పెరుగుతున్న జనాభా, పట్టణ విస్తరణను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. అయితే శ్రీకాకుళం, విజయనగరం పార్లమెంట్ నియోజకవర్గాలను యథాతథంగా కొనసాగించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఇక కోస్తాంధ్ర ప్రాంతంలో పరిస్థితి భిన్నంగా ఉంది. రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా భావించే నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా, గోదావరి జిల్లాల్లో ప్రస్తుతం ఉన్న పార్లమెంట్ స్థానాలను పెద్దగా మార్చాల్సిన అవసరం లేదని నివేదిక సూచించినట్లు తెలుస్తోంది. జనాభా నియంత్రణ, భౌగోళిక పరిమితులు, ఓటర్ల పంపిణీ సమతుల్యంగా ఉండటమే దీనికి ప్రధాన కారణంగా చెబుతున్నారు.ఈ పునర్విభజన ప్రతిపాదనలు అమలైతే రాష్ట్రంలో మొత్తం 13 అదనపు లోక్‌సభ స్థానాలు పెరిగే అవకాశం ఉంది. దీనివల్ల రాజకీయ పార్టీలకు కొత్త అవకాశాలు ఏర్పడటంతో పాటు కొత్త నాయకత్వానికి కూడా అవకాశం లభించనుంది. ముఖ్యంగా ఆశావహ నాయకులు, యువ రాజకీయ నాయకులకు కొత్త రాజకీయ వేదికలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

అయితే ఈ ప్రతిపాదనలు ప్రస్తుతం చర్చల దశలో మాత్రమే ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం, పార్లమెంట్, జనాభా లెక్కల ప్రక్రియ, డీలిమిటేషన్ కమిషన్ సిఫార్సులు వంటి అనేక దశలు పూర్తయిన తర్వాతే తుది రూపు దాల్చనున్నాయి. అయినప్పటికీ రాయలసీమకు అధిక ప్రాధాన్యం లభించే అవకాశాలు కనిపిస్తుండటంతో రాజకీయ పార్టీల్లో ఇప్పటికే ఆసక్తికర చర్చలు ప్రారంభమయ్యాయి. భవిష్యత్‌లో ఈ పునర్విభజన అమలైతే ఆంధ్రప్రదేశ్ రాజకీయ పటంలో గణనీయమైన మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా రాయలసీమ రాజకీయ ప్రభావం పెరగడం, కొత్త నియోజకవర్గాల ఏర్పాటు, నాయకత్వ మార్పులు రాష్ట్ర రాజకీయ సమీకరణాలను కొత్త మలుపు తిప్పే అవకాశాలు కనిపిస్తున్నాయి.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular