గోదావరిలో విషాదం. చేపల వేటకు వెళ్లిన ఐదుగురు మృతి
ఘటనపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దిగ్భ్రాంతి
చింతూరు, పెన్ పవర్, జూలై 18:
పోలవరం జిల్లా ఏటపాక మండలం గొల్లగూడెం సమీపంలోని గోదావరి నదిలో శనివారం విషాదకర ఘటన చోటుచేసుకుంది. చేపల వేట కోసం నదిలోకి వెళ్లిన ఐదుగురు ప్రమాదవశాత్తు గల్లంతై మృతి చెందారు. అనంతరం చేపట్టిన గాలింపు చర్యల్లో వారి మృతదేహాలను అధికారులు వెలికితీశారు. సమాచారం అందుకున్న వెంటనే సీఐ వి. కృష్ణ ఆధ్వర్యంలో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టారు. ఎస్ఐ అప్పలరాజు సిబ్బందితో కలిసి సహాయక చర్యల్లో పాల్గొన్నారు. మృతులు గొమ్ముకొత్తగూడెం గ్రామానికి చెందిన ఊకె సుశీల, ఊకె లక్ష్మి, తుర్రం భారతి, బాసిబోయిన బాలరాజు, ఊకె రమేష్‌గా గుర్తించారు. వీరిలో ముగ్గురు మహిళలు, ఇద్దరు పురుషులు ఉన్నారు. మృతదేహాలు గ్రామానికి చేరుకోగానే కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ఒకే ఘటనలో ఐదుగురు ప్రాణాలు కోల్పోవడంతో గొమ్ముకొత్తగూడెం గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. గ్రామమంతా శోకసంద్రంలో మునిగిపోయింది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. గోదావరి నదిలో చేపల వేటకు వెళ్లే సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, భద్రతా చర్యలు తప్పనిసరిగా పాటించాలని అధికారులు సూచించారు. ఇదిలా ఉండగా, ఈ దుర్ఘటనపై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేసిన ఆయన, పోలవరం జిల్లా కలెక్టర్‌తో ఫోన్‌లో మాట్లాడి ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకున్నారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం తరఫున అవసరమైన అన్ని సహాయ సహకారాలు వెంటనే అందేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించినట్లు ఉప ముఖ్యమంత్రి కార్యాలయం వెల్లడించింది.

