ఖమ్మం, పెన్ పవర్, జులై 25:
ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని వరంగల్ క్రాస్ రోడ్డు బైపాస్ రోడ్డులో బిలీఫ్ ఆస్పత్రి సమీపంలో శుక్రవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బైక్ పై వెళ్తున్న వ్యక్తిని లారీ ఢీకొనడంతో అతను వాహనం కింద పడిపోయి అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రమాద తీవ్రత కారణంగా శరీరంలోని కింది భాగం తీవ్రంగా దెబ్బతినడంతో ఘటన స్థలంలోనే ప్రాణాలు కోల్పోయాడు. మృతుడు నామవరం గ్రామానికి చెందిన గోపిగా గుర్తించారు. ఆయన స్థానికంగా ఓ షోరూమ్ లో మెకానిక్ గా పనిచేస్తున్నట్లు సమాచారం. యూనికాన్ బైక్ పై టర్నింగ్ దాటుతున్న సమయంలో నాయుడుపేట వైపు నుంచి వచ్చిన లారీ ఢీకొన్నట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలు, లారీ డ్రైవర్ వివరాలు తదితర అంశాలపై అధికారులు విచారణ చేపట్టారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు అధికారికంగా వెల్లడి కావాల్సి ఉంది.

