ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని హామీ
బ్యూరో రిపోర్ట్ పెన్ పవర్, విశాఖపట్నం జులై 5: విశాఖ ఫిషింగ్ హార్బర్‌లో సముద్రంలో చేపల వేటకు వెళ్లి గల్లంతైన మత్స్యకారుల కుటుంబాలను దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ వంశీకృష్ణ శ్రీనివాస్ ఆదివారం పరామర్శించారు. ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఆయన హుటాహుటిన ఫిషింగ్ హార్బర్‌కు చేరుకుని బాధిత కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ఘటన జరిగిన రాత్రి నుంచే మత్స్యశాఖ జాయింట్ డైరెక్టర్, నేవీ అధికారులు, జిల్లా కలెక్టర్‌తో నిరంతరం సంప్రదింపులు జరుపుతూ సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. గల్లంతైన మత్స్యకారుల కోసం కోస్ట్ గార్డ్ నౌకలతో గాలింపు చర్యలను మరింత ముమ్మరం చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించినట్లు వెల్లడించారు.
అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో సురక్షితంగా బయటపడిన ఓ మత్స్యకారుడి వీడియోను ప్రదర్శిస్తూ, మిగిలిన వారిని కూడా సురక్షితంగా రక్షించేందుకు ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టిందని చెప్పారు. గల్లంతైన వారిని క్షేమంగా తీసుకురావడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.
బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని, అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని ఎమ్మెల్యే శ్రీ వంశీకృష్ణ శ్రీనివాస్ హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే శ్రీమతి మాధవి, ఆర్‌డీవో, మత్స్యశాఖ జాయింట్ డైరెక్టర్, కూటమి నాయకులు, అధికారులు పాల్గొన్నారు.

