మాజీ ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్ డిమాండ్
నర్సీపట్నం, పెన్ పవర్ :
నర్సీపట్నం డి.ఎస్.పి శ్రీనివాసరావు తమ ఎస్సై రాజారావును కాపాడుకునే ప్రయత్నం చేశారే తప్ప, నిజాలు పూర్తిగా వెల్లడించలేదని నర్సీపట్నం మాజీ ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్ ఆరోపించారు. శనివారం వేములపూడి పంచాయతీ అప్పన్నపాలెంకు చెందిన సుర్ల నూకరాజును రూరల్ ఎస్సై రాజారావు తీవ్రంగా కొట్టి, గాయపరిచారని మాజీ ఎమ్మెల్యే గణేష్ ఆరోపించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో డి.ఎస్.పి శ్రీనివాసరావు మాజీ ఎమ్మెల్యే తప్పుడు ఆరోపణలు చేశారని, తమ కార్యాలయానికి వస్తే సీసీ ఫుటేజ్ చూసి నిజాలు తెలుసుకోవచ్చని సోషల్ మీడియా ద్వారా ఆహ్వానించారు. మాజీ ఎమ్మెల్యే గణేష్ మీడియాతో కలిసి ఆదివారం ఉదయం 11 గంటలకు డిఎస్పీ కార్యాలయానికి చేరుకున్నారు. డిఎస్పి శ్రీనివాసరావు, రూరల్ ఎస్సై రాజారావు సిసి పుటెజ్ ను మీడియా సమక్షంలో మాజీ ఎమ్మెల్యే కు చూపించారు. ఆ ఫుటేజ్ లో నూకరాజును తీసుకురావడం, అతనిని సెల్ లో ఉంచడం, సెల్ లో ఉన్న నూకరాజు తన మొలతాడు ఉపయోగించి ఆత్మహత్యకు ప్రయత్నించడం, అది గమనించిన సిబ్బంది గబగబా సెల్ లోకి వెళ్లి నూకరాజును ఆపే ప్రయత్నం చేయడం, ఈ క్రమంలో సెల్ డోర్ తగిలి నూకరాజు కాలుకి గాయం కావడం అన్ని స్పష్టంగా అందరూ చూడడం జరిగింది. అయితే సి సి ఫుటేజ్ చూసిన తర్వాత బయటకు వచ్చిన మాజీ ఎమ్మెల్యే గణేష్ మీడియాతో మాట్లాడుతూ ఇంతవరకు ఉన్న సిసి ఫుటేజ్ లో నూకరాజు ఆత్మహత్యకు ప్రయత్నించినట్లు చూడడం జరిగిందని, అయితే పోలీసుల దూషణలు, వారి ప్రవర్తనకు మానసికంగా విసిగిపోయి ఆ విధంగా ప్రవర్తించినట్లు తమతో చెప్పడం జరిగిందన్నారు. అయితే నూకరాజుకు తగిలిన గాయం పట్ల పోలీసులు ఎందుకు స్పందించలేదని, అతనికి కనీసం వైద్యం చేసేందుకు ప్రయత్నించకపోవడం విచారకరమన్నారు. అయితే తాము ఆరోపించినట్లుగా ఏడు గంటల తర్వాతే జరిగిందని, ఏడు గంటల తర్వాత ఇంటికి పంపించిన వరకు సీసీ ఫుటేజ్ చూపించాలని డిఎస్పీని కోరమన్నారు. అంతవరకు తెచ్చి, ఆ తర్వాత ఫుటైజ్ లేకపోవడంపై మాజీ ఎమ్మెల్యే అనుమానం వ్యక్తం చేశారు. తాను రూరల్ ఎస్సై పై లేనిపోని ఆరోపణలు చేయలేదని, బాధితుడు తమతో చెప్పిన దానినే పరిగణలోకి తీసుకొని మాట్లాడటం జరిగిందన్నారు. అధికారులపై తమకు ఎలాంటి విభేదాలు ఉండవని, ఏ అధికారి విధి నిర్వహణకు నర్సీపట్నం వచ్చినా, తాము పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని, లేనిపోని ఆరోపణలు చేసి వారిని వ్యక్తిగతంగా, మానసికంగా బాధపెట్టే ఉద్దేశం తమకు ఎప్పటికీ ఉండదని తెలిపారు. తాము కోరినట్లుగా ఆ రెండు గంటల సిసి ఫుటేజ్ బహిర్గతం చేసి, తమ నిజాయితీ నిరూపించుకోవాలని పోలీసులను ఉమాశంకర్ గణేష్ కోరారు.

