Homeఆంధ్రప్రదేశ్విశాఖపట్నంప్రపంచస్థాయిలో రాణించేలా విశాఖ విద్యార్థులను తీర్చిదిద్దుతాం

ప్రపంచస్థాయిలో రాణించేలా విశాఖ విద్యార్థులను తీర్చిదిద్దుతాం

ప్రపంచస్థాయిలో రాణించేలా విశాఖ విద్యార్థులను తీర్చిదిద్దుతాం

 

అడవివరం జడ్పీ హైస్కూల్‌లో మెగా పేరెంట్స్–టీచర్స్ మీటింగ్ 4.0లో కలెక్టర్ అభిషిక్త్ కిశోర్

 

విశాఖపట్నం, జూలై 24 (పెన్ పవర్): విశాఖపట్నం విద్యార్థులు ప్రపంచస్థాయిలో ప్రత్యేక గుర్తింపు పొందేలా తీర్చిదిద్దడమే జిల్లా యంత్రాంగం లక్ష్యమని జిల్లా కలెక్టర్ ఎం. అభిషిక్త్ కిశోర్ అన్నారు. అడవివరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం నిర్వహించిన మెగా పేరెంట్స్–టీచర్స్ మీటింగ్ 4.0 కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులను ఉద్దేశించి మాట్లాడారు.

 

ఈ సందర్భంగా విద్యార్థులు రూపొందించిన వివిధ ప్రాజెక్టుల ప్రదర్శనలను కలెక్టర్ పరిశీలించి అభినందించారు. విద్యార్థులు తయారు చేసిన డ్రోన్‌ను పరిశీలించిన ఆయన, అసలైన డ్రోన్‌ను పాఠశాలకు తీసుకువచ్చి ప్రత్యక్ష ప్రదర్శన ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో సమావేశమై హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డులను పరిశీలించారు. పదో తరగతి విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించి బోధన, అభ్యసన విధానాలపై అభిప్రాయాలు తెలుసుకున్నారు.

 

పాఠశాల ఈ ఏడాది పదో తరగతిలో 88 శాతం ఉత్తీర్ణత సాధించడం అభినందనీయమని పేర్కొన్న కలెక్టర్, గత ఏడాది 453 మంది ఉన్న విద్యార్థుల సంఖ్య ఈ ఏడాది 490కు పెరగడం ప్రభుత్వ పాఠశాలలపై ప్రజల్లో పెరుగుతున్న విశ్వాసానికి నిదర్శనమన్నారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులకు ఏమాత్రం తీసిపోరనే నమ్మకాన్ని పెంపొందించడంలో మెగా పీటీఎం 4.0 కీలక పాత్ర పోషిస్తోందన్నారు.

 

ప్రభుత్వం విద్యారంగానికి సుమారు రూ.10 వేల కోట్లు కేటాయించిందని, “తల్లికి వందనం” పథకం కింద ఒక్కో విద్యార్థికి రూ.15 వేల చొప్పున అందిస్తున్నట్లు తెలిపారు. లీప్ యాప్ ద్వారా విద్యార్థుల విద్యా పురోగతిని తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు తెలుసుకునే అవకాశం ఉందన్నారు.

 

విద్యార్థుల్లో భాషా నైపుణ్యాలను పెంపొందించేందుకు ప్రైవేట్ విద్యాసంస్థల సహకారంతో కొరియన్ సహా విదేశీ భాషల బోధనకు చర్యలు తీసుకోవాలని జిల్లా విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. విద్యార్థిని వర్షిణి చేసిన విజ్ఞప్తిపై సానుకూలంగా స్పందించిన కలెక్టర్, విదేశీ భాషల శిక్షణకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

 

విద్యార్థుల విజయాల్లో తల్లిదండ్రుల పాత్ర ఎంతో కీలకమని పేర్కొన్న కలెక్టర్, పిల్లల చదువుపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించారు. పాఠశాల మేనేజ్‌మెంట్ కమిటీ విజ్ఞప్తి మేరకు సీసీ కెమెరాల ఏర్పాటుకు సహకరిస్తామని తెలిపారు. ఇటీవల పదో తరగతిలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు స్టడీ మెటీరియల్, ప్రశంసాపత్రాలు, జ్ఞాపికలను అందజేసి అభినందించారు. అనంతరం విద్యార్థులతో కలిసి సహపంక్తి భోజనంలో పాల్గొన్నారు.

 

ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి ఎన్. ప్రేమ్ కుమార్, సమగ్ర శిక్ష ఏపీసీ చంద్రశేఖర్, ఎంఈవో రవీంద్రబాబు, ప్రధానోపాధ్యాయుడు పైడిరాజు, పాఠశాల మేనేజ్‌మెంట్ కమిటీ సభ్యులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular