ఎల్బీనగర్, పెన్ పవర్ జులై 24 :
సమాజాన్ని పట్టిపీడిస్తున్న గంజాయి మత్తు పదార్థాల వినియోగాన్ని పూర్తిగా నిర్మూలించేందుకు ప్రజలందరూ కలిసి కృషి చేయాలని సామాజిక కార్యకర్త కోమటిరెడ్డి రవీందర్ రెడ్డి పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన పెన్ పవర్ ప్రతినిధితో మాట్లాడారు. గంజాయి వినియోగం వల్ల ముఖ్యంగా యువత భవిష్యత్తు ప్రమాదంలో పడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. విద్యార్థులు, యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండేలా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, సమాజంలోని ప్రతిఒక్కరూ అవగాహన కల్పించాలని కోరారు. గంజాయి అక్రమ రవాణా, విక్రయాలను అరికట్టేందుకు పోలీసులు చేపడుతున్న చర్యలకు ప్రజలు సహకరించాలని ఆయన సూచించారు. గ్రామాలు, కాలనీలు, విద్యాసంస్థల్లో విస్తృత స్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించి, మత్తు పదార్థాల వల్ల కలిగే దుష్పరిణామాలను ప్రజలకు వివరించాలని అన్నారు. “మత్తు పదార్థాలకు బానిస కాకుండా విద్య, ఉపాధి, క్రీడలు మరియు మంచి విలువలతో యువత ముందుకు సాగితేనే రాష్ట్రం, దేశం అభివృద్ధి చెందుతుంది” అని కోమటిరెడ్డి రవీందర్ రెడ్డి పేర్కొన్నారు. గంజాయి రహిత సమాజ నిర్మాణం కోసం ప్రభుత్వం, పోలీసు శాఖ, స్వచ్ఛంద సంస్థలు, ప్రజాప్రతినిధులు మరియు ప్రజలు సమిష్టిగా కృషి చేయాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.

