గార్ల, పెన్ పవర్ ఆగస్టు 6:
గార్ల మండల పరిధిలోని గోపాలపురం క్రాస్ రోడ్ నుంచి డాక్య తండా వరకు నిర్మాణంలో నిలిచిపోయిన బీటీ రహదారి పనులను వెంటనే పూర్తి చేయాలని సీపీఐ రాష్ట్ర సమితి సభ్యులు కట్టేబోయిన శ్రీనివాస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం సీపీఐ నాయకులతో కలిసి అసంపూర్తిగా ఉన్న రహదారిని పరిశీలించి పరిస్థితిని సమీక్షించారు. అనంతరం ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ రహదారి నిర్మాణానికి నిధులు మంజూరై నాలుగేళ్లు గడిచినా ఇప్పటికీ పనులు పూర్తి కాకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని విమర్శించారు. సంబంధిత అధికారులు పర్యవేక్షణలో విఫలమవడం, కాంట్రాక్టర్ తీవ్ర అలసత్వం ప్రదర్శించడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు.రోడ్డుపై కేవలం కంకర వేసి పనులను నిలిపివేయడంతో నిత్యం ద్విచక్ర వాహనదారులు జారిపడి ప్రమాదాలకు గురవుతున్నారని, పలువురు తీవ్ర గాయాల పాలవుతున్నారని తెలిపారు. గ్రామస్థులు, విద్యార్థులు, రైతులు, అత్యవసర సేవలు వినియోగించుకునే ప్రజలతో పాటు మూగజీవాలు కూడా ఈ రహదారిపై ప్రయాణించలేని పరిస్థితి నెలకొన్నదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని అధికారులు, ప్రభుత్వం తక్షణమే స్పందించి యుద్ధప్రాతిపదికన బీటీ రహదారి నిర్మాణాన్ని పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ప్రజలను సమీకరించి సీపీఐ ఆధ్వర్యంలో భారీ స్థాయిలో ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో సీపీఐ మండల కార్యదర్శి జంపాల వెంకన్న, మేదరమెట్ల గిరిప్రసాద్, భూక్య హరినాయక్, గుగులోత్ రమేష్ తదితరులు పాల్గొన్నారు.

