Homeఆంధ్రప్రదేశ్విశాఖపట్నంప్రభుత్వ భూముల ఆక్రమణపై కఠిన చర్యలు తప్పవు: ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు

ప్రభుత్వ భూముల ఆక్రమణపై కఠిన చర్యలు తప్పవు: ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు

✒️

ప్రభుత్వ భూముల ఆక్రమణపై కఠిన చర్యలు తప్పవు:

ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు

బ్యూరో రిపోర్ట్ పెన్ పవర్ విశాఖపట్నం
పెందుర్తి, ఆగస్టు 6 : పెందుర్తి నియోజకవర్గంలో ప్రభుత్వ భూముల ఆక్రమణలకు పాల్పడే వారి వెన్నులో వణుకు పుట్టేలా రెవెన్యూ, పోలీసు యంత్రాంగం సమన్వయంతో పనిచేయాలని జనసేన పార్టీ ఉమ్మడి విశాఖపట్నం రూరల్ జిల్లా అధ్యక్షుడు, పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు అధికారులను ఆదేశించారు.

జీవీఎంసీ 94వ వార్డు వెంకటసాయినగర్‌లోని సర్వే నంబర్ 75లో ప్రభుత్వ భూమిని ఆక్రమించి అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయని, అందులో కూటమి నాయకుల ప్రమేయం ఉందంటూ మీడియాలో వచ్చిన కథనాలపై ఎమ్మెల్యే గురువారం తీవ్రంగా స్పందించారు.

ఈ సందర్భంగా సుజాతనగర్ క్యాంపు కార్యాలయంలో మీడియా సమక్షంలోనే తహశీల్దార్ వెంకట అప్పారావుతో ఫోన్‌లో మాట్లాడిన ఎమ్మెల్యే, ఘటనపై వెంటనే విచారణ చేపట్టి సాయంత్రానికల్లా సమగ్ర నివేదిక సమర్పించాలని ఆదేశించారు.

అనంతరం మీడియాతో మాట్లాడుతూ, ప్రభుత్వ భూములకు తాను కాపలాదారుడిగా ఉంటానని, తన ఐదేళ్ల పదవీకాలంలో ప్రభుత్వ భూములు ఆక్రమణకు గురికాకుండా కాపాడటమే లక్ష్యమని స్పష్టం చేశారు. ప్రభుత్వ భూముల రక్షణ విషయంలో పార్టీలు, వర్గాలకు అతీతంగా రెవెన్యూ, పోలీసు అధికారులు కఠినంగా వ్యవహరించాలని సూచించారు.

ప్రభుత్వ భూముల ఆక్రమణకు సంబంధించిన సమాచారం ఎవరైనా అందిస్తే వెంటనే స్పందించి సంబంధిత అధికారులతో చర్యలు తీసుకొని ఆక్రమణలను అడ్డుకుంటామని తెలిపారు. ప్రభుత్వ భూముల పరిరక్షణలో ఎలాంటి తారతమ్యానికి తావు ఉండదని స్పష్టం చేశారు.

కూటమి నాయకులపై వస్తున్న ఆరోపణలు తనను కలచివేస్తున్నాయని పేర్కొన్న ఎమ్మెల్యే, ఇటువంటి అంశాల్లో కూటమి నాయకులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. ఆక్రమణలు, అక్రమ నిర్మాణాల వల్ల కూటమి ప్రభుత్వానికి, వ్యక్తిగతంగా తనకు చెడ్డపేరు తీసుకురాకుండా ఎన్డీఏ నాయకులు అప్రమత్తంగా ఉండాలని పంచకర్ల రమేష్ బాబు పిలుపునిచ్చారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular