Homeఆంధ్రప్రదేశ్విశాఖపట్నంస్వేచ్ఛాయుత బాల్యమే సృజనాత్మకతకు పునాది ‘పిల్లలు వర్ధిల్లాలి’ పుస్తక ఆవిష్కరణలో వక్తల అభిప్రాయం

స్వేచ్ఛాయుత బాల్యమే సృజనాత్మకతకు పునాది ‘పిల్లలు వర్ధిల్లాలి’ పుస్తక ఆవిష్కరణలో వక్తల అభిప్రాయం

స్వేచ్ఛాయుత బాల్యమే సృజనాత్మకతకు పునాది

‘పిల్లలు వర్ధిల్లాలి’ పుస్తక ఆవిష్కరణలో వక్తల అభిప్రాయం

 

బ్యూరో రిపోర్ట్ పెన్ పవర్

విశాఖపట్నం, ఆగస్టు 9:
స్వేచ్ఛాయుతమైన బాల్యమే పిల్లల్లో సృజనాత్మకతను పెంపొందిస్తుందని, అలాంటి విద్యా విధానమే భవిష్యత్ తరాలకు, దేశ అభివృద్ధికి దోహదపడుతుందని వక్తలు పేర్కొన్నారు. వైజాగ్ చిల్డ్రన్స్ క్లబ్, జనవిజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో అల్లూరి సీతారామరాజు విజ్ఞాన కేంద్రంలో ‘పిల్లలు వర్ధిల్లాలి’ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం ఆదివారం నిర్వహించారు.

విఠపు బాలసుబ్రమణ్యం, సి.వి. కృష్ణయ్య రచించిన ఈ పుస్తకాన్ని శ్రీ ఈదర రవికిరణ్, ఐఆర్‌ఎస్, అడిషనల్ డైరెక్టర్ జనరల్ అండ్ కమిషనర్, నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్, ఇండైరెక్ట్ టాక్సెస్ అండ్ నార్కోటిక్స్, విశాఖపట్నం జోన్ ఆవిష్కరించారు. జనవిజ్ఞాన వేదిక జిల్లా గౌరవ అధ్యక్షులు డా. ఎన్. చంద్రశేఖర్ అధ్యక్షతన కార్యక్రమం జరిగింది.

వైజాగ్ చిల్డ్రన్స్ క్లబ్ వ్యవస్థాపకురాలు డా. కె. రమాప్రభ పుస్తకాన్ని పరిచయం చేశారు. పుస్తకంపై బాల వికాస ఫౌండేషన్ వ్యవస్థాపకులు శ్రీ నరవ ప్రకాశరావు, ‘బాలబాట’ సంపాదకురాలు శ్రీమతి స్వరాజ్యం వెంకట రమణమ్మ, రచయిత, బాలల అంశాల క్షేత్రస్థాయి కార్యకర్త శ్రీ హరి వెంకట రమణ ఆప్తవాక్యాలు పలికారు.

పుస్తకంలో ప్రస్తావించిన అంశాలకు సంఘీభావంగా కన్సర్న్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ డా. పి.కె. జోస్, ఆంధ్ర విశ్వవిద్యాలయ విశ్రాంత ఆచార్యులు శ్రీ తుమ్మల సుధాకర్ రెడ్డి, ఆంధ్ర విశ్వవిద్యాలయ పూర్వ రిజిస్ట్రార్ శ్రీ ఉమామహేశ్వరరావు, ఆసరా చారిటబుల్ సొసైటీ ప్రతినిధి శ్రీ ఎన్. సంజీవ్ కుమార్, వైజాగ్ ఎన్జీవో ఫోరం ప్రతినిధి శ్రీ ఎల్. ప్రజ్ఞాన్ కుమార్ తమ అభిప్రాయాలను వెల్లడించారు.

ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ పిల్లలకు స్వేచ్ఛాయుతమైన, ఆనందదాయకమైన బాల్యాన్ని అందించడం సమాజం బాధ్యత అని అన్నారు. పిల్లల సృజనాత్మకత, ఆలోచనా శక్తి, వ్యక్తిత్వ వికాసానికి అనుకూలమైన విద్యా విధానాలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. బాలల సంక్షేమం, హక్కుల కోసం పనిచేస్తున్న సంస్థలు, వ్యక్తులతో పాటు తల్లిదండ్రులు కూడా ‘పిల్లలు వర్ధిల్లాలి’ పుస్తకాన్ని తప్పనిసరిగా చదవాలని సూచించారు.

కార్యక్రమంలో బాలలతో పనిచేస్తున్న వివిధ సంస్థల ప్రతినిధులు, సాహితీ స్రవంతి, ప్రజ్వల్ వాణి వెల్ఫేర్ సొసైటీ సభ్యులు, ఉపాధ్యాయులు, వైజాగ్ రీడ్స్ ప్రతినిధులు, ప్రత్యామ్నాయ విద్య కోసం కృషి చేస్తున్న వ్యక్తులు, తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ఫోటో క్యాప్షన్

‘పిల్లలు వర్ధిల్లాలి’ పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్న శ్రీ ఈదర రవికిరణ్, ఐఆర్‌ఎస్ తదితరులు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular