Homeఆంధ్రప్రదేశ్విశాఖపట్నంప్రొఫెసర్‌ కె.వి. శివయ్య శత జయంతి సందర్భంగా జాతీయ సదస్సు ‘వికసిత్‌ భారత్‌ @2047’ దిశగా...

ప్రొఫెసర్‌ కె.వి. శివయ్య శత జయంతి సందర్భంగా జాతీయ సదస్సు ‘వికసిత్‌ భారత్‌ @2047’ దిశగా కామర్స్‌, మేనేజ్‌మెంట్‌ విద్య పునర్నిర్మాణంపై చర్చలు

ప్రొఫెసర్‌ కె.వి. శివయ్య శత జయంతి సందర్భంగా జాతీయ సదస్సు

‘వికసిత్‌ భారత్‌ @2047’ దిశగా కామర్స్‌, మేనేజ్‌మెంట్‌ విద్య పునర్నిర్మాణంపై చర్చలు

బ్యూరో రిపోర్ట్ పెన్ పవర్                  విశాఖపట్నం, ఆగస్టు 8:
ఆంధ్ర విశ్వవిద్యాలయం కామర్స్‌, మేనేజ్‌మెంట్‌ విద్యా పితామహుడిగా, “ఆచార్యులకే ఆచార్యుడు”గా పేరుగాంచిన దివంగత ప్రొఫెసర్‌ కె.వి. శివయ్య శత జయంతిని పురస్కరించుకుని ఆంధ్ర విశ్వవిద్యాలయంలో జాతీయ సదస్సు నిర్వహించనున్నారు. డీసీఎంఎస్‌ విభాగం, ఏయూ ఆర్ట్స్‌ అండ్‌ కామర్స్‌ కళాశాల సంయుక్త ఆధ్వర్యంలో సెప్టెంబర్‌ 3, 4 తేదీల్లో ఈ సదస్సు జరగనుంది.

“వికసిత్‌ భారత్‌ @2047 దిశగా కామర్స్‌ మరియు మేనేజ్‌మెంట్‌ విద్య పునర్నిర్మాణం” అనే ప్రధాన అంశంపై సదస్సు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ప్రొఫెసర్‌ కె.వి. శివయ్య ఆంధ్ర విశ్వవిద్యాలయంలో అనేక కీలక బాధ్యతలు నిర్వహించడంతో పాటు దక్షిణ భారతదేశ వ్యాప్తంగా కామర్స్‌ విద్య విస్తరణకు విశేష కృషి చేశారని పేర్కొన్నారు.

పోస్టర్‌ ఆవిష్కరణ

జాతీయ సదస్సు వివరాలతో రూపొందించిన పోస్టర్‌ను ఆంధ్ర విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య జి.పి. రాజశేఖర్‌ తన కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఏయూ ఆర్ట్స్‌ అండ్‌ కామర్స్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ ఆచార్య జలాది రవి, డీసీఎంఎస్‌ విభాగాధిపతి ఆచార్య ఉమాదేవి, ఆచార్య బి. మోహన్‌ వెంకటరామ్‌, ఆచార్య అరుణ్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

పరిశోధనా పత్రాలకు ఆహ్వానం

సదస్సు ప్రధాన అంశానికి సంబంధించిన మౌలిక పరిశోధనా పత్రాలను నిర్వాహకులు ఆహ్వానిస్తున్నారు. ఆసక్తి ఉన్న విద్యావేత్తలు, పరిశోధకులు తమ పరిశోధనా పత్రాలను ఆగస్టు 20వ తేదీలోగా ఏయూ ఆర్ట్స్‌ అండ్‌ కామర్స్‌ కళాశాల ప్రిన్సిపాల్‌కు, డీసీఎంఎస్‌ విభాగాధిపతికి పంపించాలని సూచించారు.

సదస్సులో ఆవిష్కరణలు, సుస్థిరత, ఉపాధి అవకాశాలు, డిజిటల్‌ పరివర్తన, ప్రపంచ పోటీతత్వం వంటి కీలక అంశాలపై ప్రధానంగా చర్చలు జరగనున్నాయి. కామర్స్‌, మేనేజ్‌మెంట్‌ విద్యలో వస్తున్న మార్పులు, భవిష్యత్‌ అవసరాలకు అనుగుణంగా విద్యా విధానాల పునర్నిర్మాణం, విద్యార్థులకు మెరుగైన ఉపాధి అవకాశాల కల్పన తదితర అంశాలపై నిపుణులు తమ అభిప్రాయాలను వెల్లడించనున్నారు.

ఈ జాతీయ సదస్సుకు పలువురు విద్యావేత్తలు, పరిశోధకులు, విధాన రూపకర్తలు, పరిశ్రమల ప్రతినిధులు హాజరుకానున్నారు. వివిధ రంగాల్లో స్థిరపడిన డీసీఎంఎస్‌ పూర్వ విద్యార్థులు కూడా సదస్సులో పాల్గొననున్నారు. సదస్సులో ఒక ప్లీనరీ సమావేశంతో పాటు నాలుగు సాంకేతిక సమావేశాలను నిర్వహించేందుకు నిర్వాహకులు ప్రణాళిక రూపొందించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular