బీజేపీ ప్రజలను మభ్యపెడుతోంది:
కాంగ్రెస్
బ్యూరో రిపోర్ట్ పెన్ పవర్ విశాఖపట్నం, ఆగస్టు 6: ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో పొందుపరిచిన హామీలనే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అమలు చేస్తూ కొత్తగా రాష్ట్రానికి ఏమీ చేయలేదని కాంగ్రెస్ నాయకుడు జగన్ మురారి విమర్శించారు. బీజేపీ మాయమాటలతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని ఆయన ఆరోపించారు.
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగలేదని కేంద్రం పార్లమెంట్‌లో స్పష్టం చేసిందని పేర్కొంటూ, ప్రైవేటీకరణను పూర్తిగా నిలిపివేస్తూ కేంద్రం లిఖితపూర్వక హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. అలాగే స్టీల్ ప్లాంట్‌కు మరిన్ని నిధులు, సొంత గనులు కేటాయించాలని కోరారు.
రైల్వే జోన్, భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం, జాతీయ విద్యా సంస్థలు, మెట్రో రైల్ వంటి ప్రాజెక్టులు కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన విభజన చట్టంలోనే ఉన్నాయని, వాటిని అమలు చేస్తూ బీజేపీ ఘనత చాటుకుంటోందని విమర్శించారు.
ప్రత్యేక హోదా, పోలవరం, రాజధాని నిర్మాణం, దుగరాజపట్నం పోర్టు వంటి విభజన హామీల అమలులో కేంద్రం విఫలమైందని ఆరోపించారు. లక్షల కోట్లు ఇచ్చామని చెబుతున్న బీజేపీ నాయకులు ఆధారాలతో బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు.

