విశాఖలో సీఐడీ అధికారులకు బ్యాంకు మోసాలు, సైబర్ నేరాలపై శిక్షణ
బ్యూరో రిపోర్ట్ పెన్ పవర్
విశాఖపట్నం, ఆగస్టు 6 : సీఐడీ ప్రాంతీయ కార్యాలయం, విశాఖపట్నంలో బ్యాంకు మోసాలు, సైబర్ సంబంధిత నేరాలపై ఒక రోజు ప్రత్యేక శిక్షణా కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు. ఈ కార్యక్రమం డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (సీఐడీ) డాక్టర్ ఏ. రవిశంకర్, ఐపీఎస్ మార్గదర్శకత్వంలో, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఎస్. శ్రీధర్, ఐపీఎస్ ఆదేశాల మేరకు అదనపు పోలీసు సూపరింటెండెంట్ & ప్రాంతీయ అధికారి డా. జి. ప్రేమ్‌కాజల్ ఆధ్వర్యంలో జరిగింది.
శిక్షణా కార్యక్రమంలో సైబర్ నిపుణుడు వి. నరసింహారావు సైబర్ నేరాలు, ఆన్‌లైన్ మోసాలపై అవగాహన కల్పించారు. ఎస్‌బీఐ ఎల్‌హెచ్‌ఓ విజయనగరం చీఫ్ మేనేజర్ చి. వి. సూర్యప్రకాశ్ బ్యాంకు మోసాలు, వాటి దర్యాప్తు విధానాలను వివరించారు. మాజీ సీనియర్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పి. రామకృష్ణ బ్యాంకు మోసాలకు సంబంధించిన చట్టపరమైన అంశాలు, నూతన క్రిమినల్ చట్టాల అమలుపై ప్రసంగించారు.
శిక్షణలో బ్యాంకు మోసాల నివారణ, సైబర్ నేరాల దర్యాప్తు, డిజిటల్ సాక్ష్యాల సేకరణ, నూతన క్రిమినల్ చట్టాల అమలు వంటి అంశాలపై సమగ్రంగా వివరించారు. కార్యక్రమంలో సీఐడీ ప్రాంతీయ కార్యాలయానికి చెందిన డీఎస్పీలు, సీఐలు, ఎస్‌ఐలు, ఇతర సిబ్బంది పాల్గొని ఇంటరాక్టివ్ సెషన్లలో చురుకుగా పాల్గొన్నారు.
ఈ శిక్షణ ద్వారా అధికారులు, సిబ్బంది తమ దర్యాప్తు నైపుణ్యాలను మరింత మెరుగుపరుచుకునే అవకాశం లభించిందని సీఐడీ అధికారులు తెలిపారు.

