విశాఖ స్టీల్ కార్మికుల నోర్లు నొక్కొద్దు
మీడియాకు సమాచారం లేకుండా చేయడమే యాజమాన్య కుట్ర: సీఐటీయూ
బ్యూరో రిపోర్ట్ పెన్ పవర్ విశాఖపట్నం, ఆగస్టు 13: విశాఖ స్టీల్ యాజమాన్యం కార్మికులు మీడియా, విలేకరులకు సంస్థకు సంబంధించిన సమాచారాన్ని షేర్ చేయడం, ఫార్వర్డ్ చేయడంపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తూ ఆగస్టు 10న జారీ చేసిన సర్క్యులర్‌ను సీఐటీయూ రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండించింది. ఈ సర్క్యులర్ కార్మికుల ప్రజాస్వామ్య హక్కులను హరించే ప్రయత్నమని విమర్శించింది.
విశాఖ స్టీల్‌కు సంబంధించిన సమాచారాన్ని కార్మికులు మీడియాకు తెలియజేయకుండా ఆంక్షలు విధించడం చట్టవిరుద్ధమని సీఐటీయూ రాష్ట్ర కమిటీ పేర్కొంది. గత 40 సంవత్సరాల్లో ఎన్నడూ లేని విధంగా ఇప్పుడు సమాచారంపై ఆంక్షలు ఎందుకు విధించాల్సి వచ్చిందని ప్రశ్నించింది. యాజమాన్య వైఫల్యాలను కప్పిపుచ్చేందుకే మీడియాకు సమాచారం చేరకుండా ప్రయత్నిస్తున్నారని ఆరోపించింది.
కార్మికులకు సుమారు రూ.900 కోట్ల మేర జీతాల బకాయిలు ఉన్నాయని, రిజర్వు నిధులు ఉన్నప్పటికీ బకాయిలు చెల్లించడంలో యాజమాన్యం నిర్లక్ష్యం వహిస్తోందని సీఐటీయూ ఆరోపించింది. వెంటనే జీతాలు చెల్లించాలని, తొలగించిన కాంట్రాక్ట్ కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేసింది. నైపుణ్యం కలిగిన కార్మికులను తొలగించి, ప్రస్తుతం పనిచేస్తున్న కార్మికులపై పని భారం పెంచడం వల్ల ప్రమాదాలు పెరుగుతున్నాయని పేర్కొంది.
విశాఖ స్టీల్‌కు సంబంధించిన సమాచారం తెలుసుకోవడం కార్మికులతో పాటు ప్రజల హక్కు అని సీఐటీయూ స్పష్టం చేసింది. విశాఖ ఉక్కు పరిశ్రమ ఘన చరిత్రను దేశవ్యాప్తంగా చాటడంలో ట్రేడ్ యూనియన్లు, కార్మికుల పాత్ర కీలకమని తెలిపింది. వరుస ప్రమాదాలు జరుగుతున్నప్పటికీ వాటిని అరికట్టడంలో యాజమాన్యం విఫలమైందని విమర్శించింది.
జూన్ 8, 2026న జరిగిన ఎస్ఎంఎస్ ప్రమాదంలో కార్మికుల మృతిపై ఇప్పటికీ పూర్తి నివేదికను వెల్లడించకపోవడం యాజమాన్య నిర్లక్ష్యానికి నిదర్శనమని సీఐటీయూ పేర్కొంది. ప్రమాదంలో మృతి చెందిన కార్మికుల కుటుంబాలకు కోటి రూపాయల పరిహారం అందించే వరకు ఈ అంశాన్ని మీడియా దృష్టికి తీసుకెళ్తామని స్పష్టం చేసింది.
కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ప్యాకేజీతో విశాఖ స్టీల్ లాభాల్లోకి వచ్చిందంటూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రచారం చేస్తున్నాయని సీఐటీయూ విమర్శించింది. అయితే అధిక నాణ్యత, గిరాకీ ఉన్న ఉక్కును ఉత్పత్తి వ్యయం కంటే తక్కువ ధరకు విక్రయించే పరిస్థితి గతంలో ఎన్నడూ లేదని పేర్కొంది. ప్లాంట్ ఆధునీకరణ, నిర్వహణపై తగిన శ్రద్ధ చూపకపోవడం వల్ల ప్రమాదాలు కొనసాగుతున్నాయని ఆరోపించింది.
భారీ పరిశ్రమలో పనిచేసే కార్మికులు సంస్థకు సంబంధించిన సమాచారాన్ని ఎవరికీ వెల్లడించకూడదనే ఆంక్షలు విధించడం సమాచార హక్కు, పత్రికా స్వేచ్ఛకు విరుద్ధమని సీఐటీయూ రాష్ట్ర కమిటీ పేర్కొంది. విశాఖ స్టీల్ యాజమాన్యం ఆగస్టు 10న జారీ చేసిన సర్క్యులర్‌ను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేసింది. లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపట్టాల్సి వస్తుందని సీఐటీయూ రాష్ట్ర కమిటీ హెచ్చరించింది.

