లిక్విడ్ గంజాయి కేసులో ముందస్తు లింక్ నిందితుడి అరెస్ట్
విద్యార్థులకు గంజాయి సరఫరా చేస్తున్న ముఠా గుట్టురట్టు
బ్యూరో రిపోర్ట్ పెన్ పవర్ విశాఖపట్నం, ఆగష్టు 12: విశాఖపట్నం నగర పోలీస్ కమిషనర్ శంకబ్రత బగ్చి ఆదేశాలతో భీమిలి పోలీసులు లిక్విడ్ గంజాయి సరఫరా గొలుసును ఛేదించారు. మూడు రోజుల క్రితం జొన్నాడ టోల్‌గేట్ వద్ద లిక్విడ్ గంజాయి కేసులో కొందరు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు, ఇరవై నాలుగు గంటల్లోనే వెనుక లింకుగా ఉన్న పాంగిని ఒడిశా రాష్ట్రంలోని బలిగూడ జిల్లాలో అదుపులోకి తీసుకున్నారు.
అనంతరం నలభై ఎనిమిది గంటల్లోనే ముందస్తు లింకుగా ఉన్న విజయవాడకు చెందిన రామును పోలీసులు అరెస్ట్ చేశారు. విచారణలో రాము విజయవాడలోని విద్యార్థులు, గంజాయికి అలవాటు పడిన వారికి చిన్న చిన్న ప్యాకెట్లుగా విడగొట్టి గంజాయిని విక్రయిస్తున్నట్లు వెల్లడైనట్లు పోలీసులు తెలిపారు.
గంజాయి అక్రమ రవాణా, విక్రయాలపై ఉక్కుపాదం మోపుతున్నామని భీమిలి సీఐ దివాకర్ యాదవ్ తెలిపారు. భీమిలి ప్రాంతంలో ఎక్కడైనా గంజాయి విక్రయం, నిల్వ లేదా వినియోగం జరుగుతున్నట్లు సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు తెలియజేయాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. సమాచారం అందించే వారి వివరాలను పూర్తిగా గోప్యంగా ఉంచుతామని తెలిపారు.
లిక్విడ్ గంజాయి సరఫరా ముఠా గుట్టును ఛేదించిన ఈ ఆపరేషన్‌కు సహకరించిన నగర పోలీస్ కమిషనర్‌కు భీమిలి పోలీసులు కృతజ్ఞతలు తెలిపారు.

