Homeఆంధ్రప్రదేశ్కాకినాడమీడియా రంగంలో తనదైన ముద్ర వేస్తున్న సీనియర్ పాత్రికేయులు రెహమాన్

మీడియా రంగంలో తనదైన ముద్ర వేస్తున్న సీనియర్ పాత్రికేయులు రెహమాన్

కాజులూరు, పెన్ పవర్ సెప్టెంబర్ 30:

మీడియా రంగంలో సుదీర్ఘ అనుభవంతో సామాజిక, రాజకీయ, ఆధ్యాత్మిక అంశాలను తనదైన శైలిలో ప్రజలకు చేరువ చేస్తున్న సీనియర్ పాత్రికేయులు, ఆర్‌వీఎంసీ యూట్యూబ్‌ చానల్‌ నిర్వాహకులు రెహమాన్‌ తన ప్రత్యేక కథనాలతో ప్రేక్షకుల మన్ననలు పొందుతున్నారు. వివిధ రాజకీయ పార్టీలకు సంబంధించిన రాజకీయ పరిణామాలను విశ్లేషణాత్మకంగా వివరిస్తూనే, గ్రామీణ ప్రాంతాల్లోని పురాతన ఆలయాలు, వాటి విశిష్టత, చారిత్రక నేపథ్యం, ఆధ్యాత్మిక విశేషాలను ప్రజలకు పరిచయం చేస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు.

రెహమాన్‌ నిర్వహించే ఇంటర్వ్యూలలో విషయ పరిజ్ఞానంతో పాటు సందర్భానుసారంగా చమత్కారాన్ని జోడించడం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. దీంతో ఆయన కథనాలు సమాచారాన్ని అందించడమే కాకుండా వీక్షకులను ఆకట్టుకునేలా సాగుతున్నాయి. మీడియా రంగంలో ఆయన అందిస్తున్న సేవలను గుర్తించిన పలు స్వచ్ఛంద సంస్థలు, వివిధ వర్గాల వారు ఆయనకు ప్రత్యేకంగా సత్కారాలు, అభినందనలు అందించడం ఆయనకు లభిస్తున్న ఆదరణకు నిదర్శనంగా నిలుస్తోంది.

సుమారు 15 ఏళ్లకు పైగా ప్రముఖ పత్రికలో పనిచేసిన అనుభవం రెహమాన్‌కు మీడియా రంగంలో విశేషంగా కలిసివచ్చిన అంశంగా పలువురు పేర్కొంటున్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో సామాజిక, ప్రజా సమస్యలపై ఆయనకు ఉన్న అవగాహనతో పాటు వివిధ రాజకీయ పార్టీల నాయకులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, వివిధ రంగాల ప్రముఖులతో ఆయనకు సుదీర్ఘ పరిచయాలు ఉన్నాయి. ముఖ్యంగా రామచంద్రపురం నియోజకవర్గంతో పాటు డాక్టర్‌ బి.ఆర్‌. అంబేద్కర్‌ కోనసీమ జిల్లాలోని పలు ప్రాంతాల్లో అధికారులు, రాజకీయ నాయకులు, ప్రజా ప్రతినిధులతో ఆయనకు సన్నిహిత పరిచయాలు ఉండటం ఆయన జర్నలిస్టుగా సాధించిన అనుభవానికి మరో బలంగా నిలుస్తోంది.

ఈ క్రమంలో ఇటీవల మెగాస్టార్‌ చిరంజీవి బ్లడ్‌ బ్యాంక్‌ సిబ్బంది, అఖిల భారత చిరంజీవి ఫ్యాన్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు రమణం స్వామినాయుడు చేతుల మీదుగా సీనియర్‌ పాత్రికేయులు రెహమాన్‌ ఘనంగా సత్కరించబడ్డారు. మీడియా రంగంలో ఆయన అందిస్తున్న సేవలను గుర్తిస్తూ అందించిన ఈ సత్కారం పట్ల కాజులూరు మండల పరిధిలోని పలువురు అధికారులు, రాజకీయ నాయకులు, పాత్రికేయ మిత్రులు హర్షం వ్యక్తం చేస్తూ రెహమాన్‌కు ప్రత్యేక అభినందనలు తెలియజేశారు.

తనకు లభించిన ఈ ఆత్మీయ గౌరవం పట్ల రెహమాన్‌ స్పందిస్తూ, తనను సత్కరించి ప్రోత్సహించిన మెగాస్టార్‌ చిరంజీవి అభిమానులకు, అఖిల భారత చిరంజీవి ఫ్యాన్స్‌ అసోసియేషన్‌ సభ్యులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. ప్రజా సమస్యలు, సామాజిక అంశాలు, రాజకీయ పరిణామాలు, ఆధ్యాత్మిక విశేషాలను వాస్తవిక దృక్పథంతో ప్రజలకు మరింత చేరువ చేయడమే తన లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular