పౌష్టికాహారం, అంగన్వాడీ సేవలపై మహిళలకు అవగాహన
ప్రీస్కూల్ కార్యక్రమాలపై తల్లులకు వివరించిన సిబ్బంది
చీరాల, సెప్టెంబర్ 30 : జాండ్రపేట, నవాబ్ పేట అంగన్వాడీ కేంద్రాల్లో అంగన్వాడీ ఉత్సవ కార్యక్రమాలను బుధవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గర్భిణులు, బాలింతలు, మూడు నుంచి ఆరు సంవత్సరాల వయస్సు గల చిన్నారులు, వారి తల్లులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా గర్భిణులు, బాలింతలు తీసుకోవాల్సిన పౌష్టికాహారం, పోషకాహారం వల్ల కలిగే ప్రయోజనాలు, చిన్నారుల ఆరోగ్య సంరక్షణపై తల్లులకు అవగాహన కల్పించారు. అలాగే మూడు నుంచి ఆరు సంవత్సరాల పిల్లలకు అంగన్వాడీ కేంద్రాల్లో నిర్వహిస్తున్న ప్రీస్కూల్ కార్యక్రమాలు, అందిస్తున్న వివిధ సేవల గురించి వివరించారు. ప్రతి మహిళ అంగన్వాడీ కేంద్రాల్లో అందుతున్న సేవలను తెలుసుకుని సద్వినియోగం చేసుకోవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు సిబ్బంది తెలిపారు. అంగన్వాడీ కేంద్రాల ద్వారా చిన్నారుల ఆరోగ్యం, పోషణ, ప్రాథమిక విద్యకు సంబంధించిన సేవలు అందుతున్నాయని వివరించారు. కార్యక్రమంలో సూపర్వైజర్ బి. సునంద, అంగన్వాడీ కార్యకర్తలు నాగేంద్రం, అస్మత్, ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

