Homeఆంధ్రప్రదేశ్విశాఖపట్నంఏపీని సినీ హబ్‌గా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యం: మంత్రి కందుల దుర్గేష్

ఏపీని సినీ హబ్‌గా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యం: మంత్రి కందుల దుర్గేష్

ఏపీని సినీ హబ్‌గా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యం: మంత్రి కందుల దుర్గేష్

 

 బ్యూరో రిపోర్ట్ పెన్ పవర్       విశాఖపట్నం, ఆగస్టు 14: ఆంధ్రప్రదేశ్‌ను సినీ హబ్‌గా తీర్చిదిద్దడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. విశాఖపట్నంలోని గురుజాడ కళాక్షేత్రంలో శుక్రవారం నిర్వహించిన ‘కొరియన్ కనకరాజు’ గ్రాండ్ సక్సెస్ మీట్‌కు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై చిత్ర యూనిట్‌ను అభినందించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ‘కొరియన్ కనకరాజు’లో హీరో వరుణ్ తేజ్ గత చిత్రాలకు భిన్నంగా ఎంతో పరిణతితో నటించారని ప్రశంసించారు. ఒకవైపు వినోదాత్మక పాత్ర, మరోవైపు శక్తివంతమైన గ్యాంగ్‌స్టర్ పాత్రలో రెండు విభిన్న షేడ్స్‌ను అద్భుతంగా ఆవిష్కరించారని అన్నారు. మెగా కుటుంబం నుంచి వచ్చిన నటనా వారసత్వాన్ని పుణికిపుచ్చుకుని వరుణ్ తేజ్ ఈ చిత్రంలో తన ప్రతిభను చాటుకున్నారని, ఇది ఆయన కెరీర్‌లోనే అత్యుత్తమ చిత్రాల్లో ఒకటిగా నిలిచిందని పేర్కొన్నారు.

కమెడియన్ సత్య తనదైన కామెడీతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారని, హీరోయిన్ రీతికా ప్రతి ఫ్రేమ్‌లోనూ మెప్పించారని మంత్రి తెలిపారు. వరుణ్ తేజ్, సత్య, రీతికల కాంబినేషన్ ప్రేక్షకులను ఆకట్టుకుందని అన్నారు. రాజకీయ కార్యకలాపాలతో నిరంతరం ఒత్తిడిలో ఉండే ప్రజాప్రతినిధులు సైతం ఈ వినోదాత్మక చిత్రాన్ని ఆస్వాదించారని చెప్పారు.

సినిమా చిత్రీకరణ మొత్తం అనంతపురం పరిసర ప్రాంతాల్లో జరగడం, రాయలసీమ యాస, నేటివిటీని సహజంగా చూపించడం అభినందనీయమన్నారు. అద్భుతమైన కథ, పటిష్టమైన స్క్రీన్‌ప్లేతో సినిమాను రక్తికట్టించిన దర్శకుడు మేర్లపాక గాంధీని, నిర్మాతలు రాజీవ్ రెడ్డి, సాయిబాబు జాగర్లమూడిని మంత్రి ప్రత్యేకంగా అభినందించారు.

ఏపీలో సినీ పరిశ్రమకు మౌలిక వసతులు

ఆంధ్రప్రదేశ్‌లో సినీ పరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని మంత్రి దుర్గేష్ తెలిపారు. డబ్బింగ్ థియేటర్లు, రీ-రికార్డింగ్ స్టూడియోలు వంటి మౌలిక వసతులను రాష్ట్రంలో ఏర్పాటు చేసేందుకు నిర్మాతలు, పారిశ్రామికవేత్తలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చే వారికి ప్రభుత్వం తరఫున అవసరమైన భూమి, ఇతర సహకారాన్ని అందిస్తామని హామీ ఇచ్చారు.

కళాకారుడైన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, విజన్ ఉన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కలిసి ఆంధ్రప్రదేశ్‌లో సినీ పరిశ్రమ బలోపేతానికి ప్రత్యేక ప్రణాళికలతో ముందుకు సాగుతున్నారని మంత్రి తెలిపారు.

జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆశీస్సులతోనే తాను మంత్రిగా బాధ్యతలు చేపట్టానని, ఆయనకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నానని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మార్గదర్శకత్వంలో పనిచేయడం గర్వంగా ఉందన్నారు. సహచర ప్రజాప్రతినిధి, ఎమ్మెల్సీ నాగబాబుతో కలిసి పనిచేయడం ఆనందంగా ఉందని మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular