Homeఆంధ్రప్రదేశ్విశాఖపట్నంపంచధర్లలో అక్రమ మైనింగ్‌ను అడ్డుకోవాలి వారసత్వ సంపదకు ముప్పు.. సమగ్ర దర్యాప్తు జరిపి బాధ్యులపై చర్యలు...

పంచధర్లలో అక్రమ మైనింగ్‌ను అడ్డుకోవాలి వారసత్వ సంపదకు ముప్పు.. సమగ్ర దర్యాప్తు జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలి

పంచధర్లలో అక్రమ మైనింగ్‌ను అడ్డుకోవాలి

వారసత్వ సంపదకు ముప్పు.. సమగ్ర దర్యాప్తు జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలి

కేంద్ర గనుల మంత్రి కిషన్‌రెడ్డికి వైఎస్సార్‌సీపీ ప్రతినిధుల విజ్ఞప్తి

 

బ్యూరో రిపోర్ట్ పెన్ పవర్,     న్యూఢిల్లీ ఆగష్టు 11: విశాఖపట్నం జిల్లా పంచధర్ల పరిసరాల్లో జరుగుతున్న అక్రమ కంకర తవ్వకాలను తక్షణమే నిలిపివేయాలని వైఎస్సార్‌సీపీ ప్రతినిధుల బృందం కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్‌రెడ్డిని కోరింది. అక్రమ మైనింగ్ కారణంగా పంచధర్ల ప్రాంతంలోని చారిత్రక, పురావస్తు వారసత్వ సంపదకు తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని వారు కేంద్రమంత్రి దృష్టికి తీసుకెళ్లారు.

భారత పురావస్తు శాఖ (ఏఎస్ఐ) సంరక్షణలో ఉన్న ధనదిబ్బలు బౌద్ధ పురావస్తు ప్రదేశం కావడంతో పాటు, పురాతన శ్రీ ధర్మలింగేశ్వర స్వామి ఆలయం కూడా ఈ ప్రాంతంలో ఉందని వైఎస్సార్సీపీ నేతలు తెలిపారు. ధనదిబ్బలు శాతవాహనుల కాలానికి, శ్రీ ధర్మలింగేశ్వర స్వామి ఆలయం సుమారు 10వ శతాబ్దానికి చెందినవని పేర్కొంటూ, ఇలాంటి చారిత్రక ప్రదేశాలకు సమీపంలో భారీ స్థాయిలో క్వారీ కార్యకలాపాలు నిర్వహించడం ఆందోళనకరమన్నారు.

లోతైన తవ్వకాలు, పేలుళ్ల కారణంగా పురావస్తు అవశేషాలు దెబ్బతినే అవకాశం ఉందని, శతాబ్దాల నాటి ఆలయంపై కూడా ప్రభావం పడే ప్రమాదం ఉందని వారు హెచ్చరించారు. పంచధర్ల కొండ భూగర్భ స్థిరత్వం దెబ్బతినడంతో పాటు భూగర్భ జలాలు, సహజ మురుగునీటి వ్యవస్థలపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందని తెలిపారు.

మైనింగ్ కార్యకలాపాల చట్టబద్ధతను పరిశీలించేందుకు, మంజూరైన సరిహద్దులు, అనుమతించిన తవ్వకాల లోతు, పరిమాణాన్ని మించి తవ్వకాలు జరిగాయా లేదా అనే అంశాలపై సమగ్ర దర్యాప్తు చేపట్టాలని వైఎస్సార్సీపీ బృందం కేంద్రాన్ని కోరింది. అవసరమైతే నిపుణుల బృందాన్ని పంచధర్లకు పంపించి క్షేత్రస్థాయిలో పరిశీలన చేయాలని విజ్ఞప్తి చేసింది. నిబంధనల ఉల్లంఘనలు తేలితే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరింది.

కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డిని కలిసిన వైఎస్సార్సీపీ ప్రతినిధుల బృందంలో ఎంపీలు గొల్ల బాబూరావు, మేడా రఘునాధరెడ్డి, గుమ్మ తనుజారాణి, మద్దిల గురుమూర్తి, మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌, మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ తదితరులు ఉన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular