Homeఆంధ్రప్రదేశ్బాపట్లచెత్త రహిత ఉప్పుటూరే లక్ష్యం.. స్వచ్ఛతపై అధికారుల పిలుపు!

చెత్త రహిత ఉప్పుటూరే లక్ష్యం.. స్వచ్ఛతపై అధికారుల పిలుపు!

డెంగ్యూ, మలేరియాకు చెక్ పెట్టేందుకు ప్రతి ఇంటా పరిశుభ్రత పాటించాలి

తడి–పొడి చెత్త వేరు చేయాలి.. ప్లాస్టిక్ వినియోగానికి స్వస్తి పలకాలి

ఉప్పుటూరు, సెప్టెంబర్ 19 (పెన్ పవర్):

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర’ కార్యక్రమంలో భాగంగా ఉప్పుటూరు గ్రామ పంచాయతీ పరిధిలో శనివారం విస్తృత అవగాహన కార్యక్రమం నిర్వహించారు. గ్రామాన్ని పరిశుభ్రంగా, వ్యాధుల రహితంగా ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా గ్రామస్తులకు పలు సూచనలు చేశారు.

ఈ సందర్భంగా ఉప్పుటూరు ప్రభుత్వ హోమియో వైద్యులు డాక్టర్ దాసరి చంద్రశేఖర్ మాట్లాడుతూ పరిసరాల పరిశుభ్రత లోపిస్తే డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ వంటి సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉందన్నారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించి గ్రామ పరిశుభ్రతలో పంచాయతీ సిబ్బందికి సహకరించాలని సూచించారు. ఇళ్లలో ఉత్పత్తయ్యే తడి, పొడి చెత్తను విడివిడిగా భద్రపరిచి పంచాయతీ పారిశుధ్య సిబ్బందికి మాత్రమే అందించాలని, రోడ్లు, ఖాళీ స్థలాల్లో చెత్త వేయరాదన్నారు.

ఇళ్ల పరిసరాలు, డాబాలు, పాత టైర్లు, కొబ్బరి చిప్పలు, పూలకుండీల్లో వర్షపు నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని, దోమల వృద్ధిని అరికట్టాలని సూచించారు. ఒకసారి వినియోగించే ప్లాస్టిక్ వస్తువులు, కవర్లను పూర్తిగా నివారించి బట్ట సంచులను ఉపయోగించాలని కోరారు. కాచి చల్లార్చిన నీటిని తాగడంతో పాటు తాగునీటి పాత్రలకు మూతలు పెట్టుకోవాలని, భోజనానికి ముందు, బహిర్భూమి నుంచి వచ్చిన తర్వాత సబ్బుతో చేతులు శుభ్రంగా కడుక్కోవాలని సూచించారు. బహిరంగ మల, మూత్ర విసర్జనను పూర్తిగా నివారించాలని తెలిపారు.

అనంతరం గ్రామస్తులతో స్వచ్ఛ ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి నీలం వెంకట రామకృష్ణ, పంచాయతీ సిబ్బంది రామారావు, వెంకటేష్, పోతురాజు, రత్నకుమారి, పద్మావతి, సత్య, స్వచ్ఛంద సేవకురాలు కె. నాగరాజా, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular