చీరాల, సెప్టెంబర్ 25 : విద్యార్థుల్లో ప్రతిభను వెలికితీయడంతో పాటు స్వామి వివేకానంద ఆశయాలను పెంపొందించే లక్ష్యంతో నిర్వహించిన 16వ శ్రీ వివేకానంద వార్షిక సాంస్కృతిక పోటీలు శుక్రవారం చీరాల పద్మశాలీయ బహుత్తమ కళ్యాణ మండపంలో ఘనంగా నిర్వహించారు. చీరాల రామకృష్ణ సేవా సమితి ఆధ్వర్యంలో ఈ పోటీలు నిర్వహించినట్లు సమితి అధ్యక్షుడు మూర్తి తెలిపారు. ఈ సందర్భంగా స్వామి వివేకానంద చికాగో ఉపన్యాసం, క్విజ్, పద్య పఠనం, చేతివ్రాత తదితర విభాగాల్లో పోటీలు నిర్వహించారు. చీరాల, వేటపాలెం, చిన్నగంజాం తదితర సమీప మండలాల నుంచి ప్రభుత్వ పాఠశాలలకు చెందిన సుమారు 250 మంది విద్యార్థులు పోటీల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. పోటీలకు న్యాయ నిర్ణేతలుగా బందా వెంకట శక్తిధర్, డీఎస్ఆర్ ఆంజనేయులు, యు. బాలకృష్ణ, వెంకట్రావు, బంగారు రాణి, కె. పద్మిని, మధు వ్యవహరించారు. జూనియర్, సీనియర్ విభాగాల్లో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచిన విద్యార్థులకు అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా బహుమతులు అందజేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమానికి అన్ని విధాల సహాయ సహకారాలు అందించిన కళ్యాణ మండపం యాజమాన్యానికి, మిత్రులు, శ్రేయోభిలాషులకు రామకృష్ణ సేవా సమితి ప్రతినిధులు కృతజ్ఞతలు తెలిపారు.

