Homeఆంధ్రప్రదేశ్పశ్చిమ గోదావరినులిపురుగుల నివారణ మాత్రల పంపిణీ

నులిపురుగుల నివారణ మాత్రల పంపిణీ

 

అత్తిలి పీహెచ్‌సీ పరిధిలో 6,328 మంది బాలబాలికలకు అల్బెండజోల్‌ మాత్రలు

అత్తిలి, పెన్ పవర్, సెప్టెంబర్ 28:
జాతీయ నులిపురుగుల నివారణ కార్యక్రమంలో భాగంగా అత్తిలి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని ప్రభుత్వ పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలు, ప్రైవేట్‌ విద్యాసంస్థల్లో ఒకటి నుంచి 19 సంవత్సరాల వయసు గల బాలబాలికలకు నులిపురుగుల నివారణ మాత్రలను సోమవారం పంపిణీ చేశారు. కార్యక్రమంలో భాగంగా మొత్తం 6,328 మంది విద్యార్థులకు అల్బెండజోల్‌ మాత్రలు అందించినట్లు అత్తిలి ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారులు డాక్టర్‌ కె. నాగరాజు, డాక్టర్‌ ఆర్‌. సురేఖ తెలిపారు.

ఈ సందర్భంగా వైద్యాధికారులు మాట్లాడుతూ చిన్నారుల్లో నులిపురుగుల సమస్యను నివారించేందుకు ప్రభుత్వం నిర్వహిస్తున్న జాతీయ నులిపురుగుల నివారణ కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేస్తున్నట్లు తెలిపారు. నులిపురుగుల వల్ల పిల్లల్లో రక్తహీనత, బలహీనత, ఆకలి తగ్గడం, పోషకాహార లోపం వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉందని, అందువల్ల వైద్య సిబ్బంది సూచనల మేరకు అల్బెండజోల్‌ మాత్రలను తప్పనిసరిగా తీసుకోవాలని సూచించారు.

 

పిల్లలు ఆరోగ్యంగా ఉండేందుకు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, ఆహారం తీసుకునే ముందు చేతులను సబ్బుతో శుభ్రంగా కడుక్కోవాలని, వ్యక్తిగత పరిశుభ్రతను పాటించాలని వైద్యాధికారులు సూచించారు. బహిరంగ ప్రదేశాల్లో మలవిసర్జన చేయకుండా మరుగుదొడ్లను వినియోగించడం, పరిశుభ్రమైన ఆహారం, తాగునీటిని తీసుకోవడం ద్వారా నులిపురుగుల వ్యాప్తిని నియంత్రించవచ్చని తెలిపారు.

ప్రభుత్వ పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలు, ప్రైవేట్‌ విద్యాసంస్థల్లో కార్యక్రమాన్ని సమన్వయంతో నిర్వహించినట్లు చెప్పారు. విద్యార్థులకు మాత్రలు అందించడంతో పాటు నులిపురుగుల నివారణ, వ్యక్తిగత పరిశుభ్రతపై అవగాహన కల్పించారు.

ఈ కార్యక్రమంలో హెల్త్‌ ఎడ్యుకేటర్‌ జి. ప్రమీలాదేవి, సూపర్‌వైజర్లు ఎ. అమ్మాజీ, కె. వెంకటరాజు, ఏఎన్‌ఎంలు, ఎంఎల్‌హెచ్‌పీలు, అంగన్‌వాడీ టీచర్లు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular