Homeఆంధ్రప్రదేశ్కాకినాడకాకినాడలో నగరపాలక సంస్థ, గ్రామపంచాయతీ ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు

కాకినాడలో నగరపాలక సంస్థ, గ్రామపంచాయతీ ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు

కాకినాడ, నవంబర్ 13 (పెన్ పవర్):

కాకినాడ నగరపాలక సంస్థతో పాటు జిల్లాలో గ్రామపంచాయతీ ఎన్నికలను స్వేచ్ఛాయుత, ప్రశాంత వాతావరణంలో, పారదర్శకంగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం పకడ్బందీ ఏర్పాట్లు చేపడుతోందని జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ తెలిపారు. శుక్రవారం కాకినాడ కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్ హాలులో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో నగరపాలక సంస్థ, గ్రామపంచాయతీ ఎన్నికల షెడ్యూల్, నామినేషన్ల స్వీకరణ, పోలింగ్, ఓట్ల లెక్కింపు, భద్రతా ఏర్పాట్ల వివరాలను వెల్లడించారు.

కాకినాడ నగరపాలక సంస్థ పరిధిలోని 66 వార్డులకు కార్పొరేటర్లతో పాటు మేయర్ పదవికి ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇందుకోసం 306 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని, నవంబర్ 26న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగుతుందని పేర్కొన్నారు. అవసరమైతే నవంబర్ 27న రీపోలింగ్ నిర్వహిస్తామని, నవంబర్ 30న ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుందని వెల్లడించారు. ఈ నెల 14 నుంచి 16 వరకు నామినేషన్ల స్వీకరణ, 17న పరిశీలన, 19న ఉపసంహరణ ప్రక్రియ ఉంటుందని వివరించారు. ఎన్నికల విధుల నిర్వహణకు అధికారులు, సిబ్బందికి అవసరమైన శిక్షణ పూర్తి చేశామని తెలిపారు. ఎన్నికలకు సంబంధించి సందేహాలు, సమస్యల పరిష్కారానికి 89788 45559 నంబరుతో ప్రత్యేక కాల్ సెంటర్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు.

జిల్లాలో మొత్తం 385 గ్రామపంచాయతీలు ఉండగా, న్యాయస్థానాల్లో కేసులు పెండింగ్‌లో ఉన్న ఆరు పంచాయతీలను మినహాయించి 379 గ్రామపంచాయతీలకు మూడు విడతల్లో ఎన్నికలు నిర్వహించనున్నట్లు కలెక్టర్ తెలిపారు. మొదటి విడతలో నవంబర్ 26న కాకినాడ రూరల్, కరప, తాళ్లరేవు, పెద్దాపురం, సామర్లకోట మండలాల్లోని 93 గ్రామపంచాయతీలకు, వాటి పరిధిలోని 1,064 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. రెండో విడతలో నవంబర్ 29న పెద్దపూడి, కాజులూరు, గొల్లప్రోలు, పిఠాపురం, యు.కొత్తపల్లి, గండేపల్లి, జగ్గంపేట, కిర్లంపూడి మండలాల్లోని 149 పంచాయతీలకు, 1,684 వార్డులకు పోలింగ్ నిర్వహిస్తారు. మూడో విడతలో డిసెంబర్ 2న కోటనందూరు, తుని, తొండంగి, ప్రత్తిపాడు, శంఖవరం, ఏలేశ్వరం, రౌతులపూడి మండలాల్లోని 137 పంచాయతీలకు, 1,478 వార్డులకు ఎన్నికలు నిర్వహించనున్నట్లు వివరించారు.

ఏకగ్రీవంగా ఎన్నికయ్యే గ్రామపంచాయతీలకు జనాభా ప్రాతిపదికన రూ.15 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు ప్రోత్సాహక నిధులు అందించనున్నట్లు కలెక్టర్ వెల్లడించారు. ఐదు వేల వరకు జనాభా ఉన్న పంచాయతీలకు రూ.15 లక్షలు, 5 వేల నుంచి 10 వేల వరకు జనాభా ఉన్న పంచాయతీలకు రూ.25 లక్షలు, 10 వేలకు పైగా జనాభా ఉన్న పంచాయతీలకు రూ.50 లక్షలు కేటాయిస్తారని తెలిపారు. ఈ నిధులను గ్రామాభివృద్ధి, ప్రజా సంక్షేమ కార్యక్రమాలకే వినియోగించాలని స్పష్టం చేశారు. ఎలాంటి ఒత్తిళ్లు, ప్రలోభాలు లేకుండా గ్రామ ప్రజల స్వచ్ఛంద అంగీకారంతో ఏకగ్రీవంగా ఎన్నికైన పంచాయతీలకే ఈ ప్రోత్సాహకం వర్తిస్తుందని పేర్కొన్నారు.

సర్పంచ్ స్థానాలను వేలం పాటల ద్వారా ఎంపిక చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, ఇలాంటి చర్యలు ఎన్నికల నిబంధనలకు విరుద్ధమని కలెక్టర్ హెచ్చరించారు. ఈ వ్యవహారాలపై నిర్దిష్టమైన ఆధారాలతో ఫిర్యాదు చేస్తే బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, నిబంధనల ఉల్లంఘన నిర్ధారణ అయితే సంబంధిత ఎన్నికలను రద్దు చేసేందుకు కూడా వెనుకాడబోమని స్పష్టం చేశారు. నామినేషన్ కేంద్రాల లోపల, వెలుపల సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసి నామినేషన్ల దాఖలు, పరిశీలన, ఉపసంహరణ ప్రక్రియలను నిరంతరం పర్యవేక్షిస్తామని తెలిపారు.

ఎన్నికల సంఘం గెజిట్ నోటిఫికేషన్‌లో పేర్కొన్న ప్రాంతాలు, వార్డుల పరిధిలోనే ఎన్నికలు నిర్వహిస్తామని, కొత్త ప్రాంతాలను ప్రస్తుత ఎన్నికల ప్రక్రియలో చేర్చడం సాధ్యం కాదని కలెక్టర్ స్పష్టం చేశారు. ఓటర్లకు అసౌకర్యం కలగకుండా క్షేత్రస్థాయి పరిశీలన, గత ఎన్నికల అనుభవాల ఆధారంగా కొన్ని ప్రాంతాల్లో పోలింగ్ కేంద్రాలను మార్పు చేసినట్లు తెలిపారు. ఎన్నికల్లో అక్రమాలు, ప్రలోభాలను అరికట్టేందుకు ఫ్లయింగ్ స్క్వాడ్లు, స్టాటిస్టికల్ సర్వైలెన్స్ బృందాలను ఏర్పాటు చేశామని వెల్లడించారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని రాజకీయ పార్టీలు, అభ్యర్థులు, ప్రజలు తప్పనిసరిగా పాటించాలని, ప్రజాస్వామ్య విలువలను కాపాడుతూ ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా జిల్లా యంత్రాంగానికి సహకరించాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular