గార్ల, పెన్ పవర్ ,అక్టోబర్: 9
ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడంతో పాటు, పల్లె దవాఖానాలో మౌలిక సదుపాయాలపై ప్రత్యేక దృష్టి సారించాలని మెడికల్ ఆఫీసర్ డాక్టర్ హనుమంతరావు సూచించారు. గార్ల మండల పరిధిలోని పిన్రెడ్డిగూడెం పల్లె దవాఖానాను సందర్శించిన ఆయన రికార్డులు, రిజిస్టర్లను పరిశీలించారు. దవాఖానా ఆవరణలో మూత లేకుండా ప్రమాదకరంగా ఉన్న సంపును గుర్తించి, ప్రమాదాలు జరగకుండా శాశ్వతంగా మూత ఏర్పాటు చేయాలని సిబ్బందిని ఆదేశించారు. దవాఖానా ప్రధాన ద్వారం వద్ద ఉన్న సమస్యలను పరిష్కరించి, అవసరమైన మరమ్మతులు చేపట్టాలని సర్పంచ్ కెలోత్ వీరన్నతో పాటు గ్రామపంచాయతీ సిబ్బందికి సూచించారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహించకుండా, సమయపాలన పాటిస్తూ ప్రజలకు అందుబాటులో ఉండాలని వైద్య సిబ్బందిని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ ప్రమీల ఏఎన్ఎం లో ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

