పేదల సొంతింటి కలను సాకారం చేస్తున్న ఇందిరమ్మ ఇళ్లు
పేద కుటుంబాల జీవితాల్లో వెలుగులు నింపుతూ.. సొంతింటి కలను నిజం చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకం
ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ వేడుకలో పాల్గొన్న ఏదులాపురం మున్సిపాలిటీ కాంగ్రెస్ అధ్యక్షులు బానోత్ కిషోర్ నాయక్
ఖమ్మం, పెన్ పవర్, అక్టోబర్ 7:
ఖమ్మం ఏదులాపురం మున్సిపాలిటీ 27వ వార్డు పరిధిలో నిర్మించిన ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ వేడుక ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఏదులాపురం మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బానోత్ కిషోర్ నాయక్, 27వ వార్డు కౌన్సిలర్ భూక్యా పుల్చంద్ హాజరై నూతన గృహంలోకి అడుగుపెట్టిన లబ్ధిదారుల కుటుంబ సభ్యులను అభినందించి, శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పేద ప్రజల జీవితాల్లో సొంతింటి సంతోషాన్ని నింపడం ఎంతో గొప్ప విషయమని, ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా ఎన్నో పేద కుటుంబాల చిరకాల కోరిక నెరవేరుతోందని అన్నారు. సొంత ఇల్లు అనేది ప్రతి కుటుంబానికి భద్రత, ఆత్మగౌరవానికి ప్రతీక అని, ఆ కలను సాకారం చేసే దిశగా ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు అభినందనీయమని పేర్కొన్నారు. ప్రతి పేద కుటుంబానికి సొంతింటి కలను సాకారం చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని, అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలాలు అందేలా కృషి కొనసాగుతుందని తెలిపారు. ఇందిరమ్మ ఇల్లు నిర్మించుకుని నూతన గృహంలోకి అడుగుపెట్టిన కుటుంబంలో కనిపిస్తున్న ఆనందం తమకు కూడా ఎంతో సంతోషాన్ని కలిగించిందని నాయకులు పేర్కొన్నారు. ఇందిరమ్మ ఇల్లు మంజూరు కావడంలో సహకరించిన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలిపారు. తమ కుటుంబానికి సొంతింటి కల సాకారం కావడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ధరావత్ కిషన్, ధరావత్ రామారావు, చేను శ్రీను, వార్డు నాయకులు, కాంగ్రెస్ కార్యకర్తలు, లబ్ధిదారులు, వారి కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

