Homeతెలంగాణసైబర్ నేరాలపై అప్రమత్తతే అసలైన రక్షణ

సైబర్ నేరాలపై అప్రమత్తతే అసలైన రక్షణ

 

మహబూబాబాద్, పెన్ పవర్, అక్టోబర్: 31

సైబర్ నేరాల పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద ఫోన్ కాల్స్, మెసేజ్‌లు వచ్చినప్పుడు తొందరపడి స్పందించకుండా ఆగి, ఆలోచించి, నిజానిజాలు నిర్ధారించుకోవాలని జిల్లా ఎస్పీ డా. శబరీష్ సూచించారు. ‘పాజ్ ఫర్ సేఫ్టీ.. పాజ్, థింక్, వెరిఫై’ నినాదంతో సైబర్ నేరాల నివారణపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు శనివారం మహబూబాబాద్ పట్టణంలో జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో భారీ ఫ్లాష్‌వాక్ నిర్వహించారు.జాతీయ సైబర్ సెక్యూరిటీ అవగాహన మాసోత్సవ ముగింపు కార్యక్రమంలో భాగంగా నెహ్రూ సెంటర్ నుంచి మూడు కోట్ల సెంటర్ వరకు ఈ ర్యాలీ కొనసాగింది. జిల్లా ఎస్పీ డా. శబరీష్‌తో పాటు విద్యార్థులు, యువత, పట్టణ ప్రజలు, పోలీసు అధికారులు, సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. విద్యార్థులు టార్చ్‌లైట్లు, సైబర్ భద్రతపై అవగాహన కల్పించే ప్లకార్డులు ప్రదర్శిస్తూ ర్యాలీలో ఉత్సాహంగా పాల్గొన్నారు. ‘సైబర్ హెల్ప్‌లైన్ 1930’, ‘నో డిజిటల్ అరెస్ట్’ వంటి నినాదాలతో ప్రజలకు అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రస్తుత డిజిటల్ యుగంలో సైబర్ నేరగాళ్లు కొత్త పద్ధతుల్లో ప్రజలను మోసం చేస్తున్నారని తెలిపారు. పోలీసులమని, సీబీఐ, ఇతర దర్యాప్తు సంస్థల అధికారులమని ఫోన్ చేసి డిజిటల్ అరెస్ట్ పేరుతో బెదిరించే వారిని నమ్మవద్దని సూచించారు. చట్టంలో డిజిటల్ అరెస్ట్ అనే విధానం లేదని స్పష్టం చేశారు. అలాంటి ఫోన్ కాల్స్ వస్తే భయపడకుండా వెంటనే పోలీసులకు సమాచారం అందించాలన్నారు.బ్యాంకు అధికారులమని చెప్పి ఫోన్ చేసినా ఎవరికీ ఓటీపీలు, బ్యాంకు ఖాతా వివరాలు, వ్యక్తిగత సమాచారాన్ని వెల్లడించవద్దని సూచించారు. గుర్తుతెలియని లింకులను క్లిక్ చేయడం, అనుమానాస్పద యాప్‌లను డౌన్‌లోడ్ చేసుకోవడం, ఆన్‌లైన్‌లో ఆకర్షణీయమైన ఆఫర్లను నమ్మడం వల్ల మోసపోయే ప్రమాదం ఉందన్నారు. సైబర్ మోసానికి గురైన వారు ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే 1930 జాతీయ సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్‌కు ఫిర్యాదు చేయాలని తెలిపారు.సైబర్ నేరాల నివారణ పోలీసుల బాధ్యత మాత్రమే కాదని, ప్రతి పౌరుడు బాధ్యతగా వ్యవహరించాలని, కుటుంబ సభ్యులు, స్నేహితులకు కూడా సైబర్ భద్రతపై అవగాహన కల్పించాలని ఎస్పీ పిలుపునిచ్చారు. ఈకార్యక్రమంలో డీఎస్పీ తిరుపతిరావు, టౌన్ సీఐ రఘుపతిరెడ్డి, రూరల్ సీఐ అంజలి, సైబర్ సెక్యూరిటీ అధికారులు, పోలీసు సిబ్బంది, విద్యార్థులు, యువత, పట్టణ ప్రజలు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular