లోటుపాట్లకు తావులేకుండా పకడ్బందీ చర్యలు చేపట్టాలి
కాకవాడ, రాకోట గ్రామాల్లో క్షేత్రస్థాయి పరిశీలన
గంగవరం /రంపచోడవరం, పెన్ పవర్, అక్టోబర్ 8: రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ పోలవరం జిల్లా పర్యటన వాయిదా పడిన నేపథ్యంలో, తదుపరి పర్యటనకు సంబంధించి ఏర్పాట్లను మరింత పకడ్బందీగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ కె. దినేష్ కుమార్ అధికారులను ఆదేశించారు. అక్టోబర్ 9న జరగాల్సిన పర్యటన వాయిదా పడటంతో గురువారం రాత్రి ఆయన కాకవాడ, రాకోట గ్రామాల్లో క్షేత్రస్థాయిలో పర్యటించి ఏర్పాట్లను పరిశీలించారు. ఎస్టీ శాసనసభా కమిటీ చైర్మన్, శాసన సభ్యురాలు మిరియాల శిరీషా దేవి సైతం పర్యటన ఏర్పాట్లను పరిశీలించి అధికారులతో చర్చించారు.
ఈ సందర్భంగా కార్యక్రమ వేదికలు, ప్రజలతో ముఖాముఖి నిర్వహించే ప్రాంతాలు, రాకపోకల మార్గాలు, పారిశుధ్యం, విద్యుత్ సరఫరా, ఇతర మౌలిక సదుపాయాలను కలెక్టర్ క్షుణ్ణంగా పరిశీలించారు. ఆయా ప్రాంతాల్లో గుర్తించిన లోటుపాట్లను తక్షణమే సరిదిద్ది, పర్యటనకు అవసరమైన అన్ని ఏర్పాట్లను సమగ్రంగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు.
అధికారులదే వ్యక్తిగత బాధ్యత
పర్యటన ఏర్పాట్లలో ప్రతి శాఖ అధికారి వ్యక్తిగత బాధ్యతతో వ్యవహరించాలని కలెక్టర్ స్పష్టం చేశారు. ముఖ్యంగా తహసీల్దార్లు తమ పరిధిలోని కార్యక్రమాలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా విజయవంతంగా జరిగేలా పూర్తి బాధ్యత తీసుకోవాలని ఆదేశించారు. అల్పాహారం, తాగునీరు, పారిశుధ్యం, వేదికల ఏర్పాటు, కార్యక్రమంలో మాట్లాడే వారి వివరాలు, అవసరమైన సమాచార నోట్స్ తదితర అంశాలను ముందుగానే పరిశీలించి, ఎక్కడా లోటుపాట్లకు అవకాశం లేకుండా చర్యలు చేపట్టాలన్నారు.
కాకవాడ, రాకోట గ్రామాల్లో పారిశుధ్యాన్ని మరింత మెరుగుపరచాలని, కార్యక్రమ నిర్వహణకు సంబంధించిన కీలక అంశాలపై విధుల్లో పాల్గొనే సిబ్బందికి ముందస్తు అవగాహన, శిక్షణ కల్పించాలని సూచించారు. తహసీల్దార్లు గుర్తించిన అవసరాలకు అనుగుణంగా ఇంజినీరింగ్ శాఖలు తమ పరిధిలోని పనులను సకాలంలో పూర్తి చేయాలన్నారు.
విద్యుత్, ట్రాఫిక్‌పై ప్రత్యేక దృష్టి
ఉప ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా విద్యుత్ సరఫరాలో ఎలాంటి అంతరాయం కలగకుండా ఏపీఈపీడీసీఎల్ అధికారులు ముందస్తు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. విద్యుత్ తీగలు ఎక్కడా వదులుగా ఉండకుండా తనిఖీలు నిర్వహించి భద్రతా చర్యలు చేపట్టాలన్నారు. కార్యక్రమ సమయంలో ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా పోలీసు శాఖ ప్రత్యేక ప్రణాళికతో వ్యవహరించాలని సూచించారు.
పర్యటన ఏర్పాట్లను జాయింట్ కలెక్టర్ సూరపాటి ప్రశాంత్ కుమార్, రంపచోడవరం సబ్ కలెక్టర్ డి. పృథ్వీ రాజ్ కుమార్ సమగ్రంగా పర్యవేక్షించాలని కలెక్టర్ ఆదేశించారు. ఉప ముఖ్యమంత్రి పర్యటన విజయవంతమయ్యేలా అన్ని శాఖల అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేయాలని, కేటాయించిన విధులను బాధ్యతాయుతంగా నిర్వహించాలని స్పష్టం చేశారు.
ఈ క్షేత్రస్థాయి పరిశీలనలో జాయింట్ కలెక్టర్ సూరపాటి ప్రశాంత్ కుమార్, సబ్ కలెక్టర్ డి. పృథ్వీ రాజ్ కుమార్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

