కొత్త షెడ్యూల్‌కు అనుగుణంగా ఏర్పాట్లు పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశం
భద్రత, పారిశుద్ధ్యం, రహదారులు, విద్యుత్, తాగునీరు, హెలిప్యాడ్ ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి
గంగవరం /రంపచోడవరం, పెన్ పవర్, అక్టోబర్ 6:
పోలవరం జిల్లా రంపచోడవరం మండలంలోని కాకవాడ, రాకోట గ్రామాల్లో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ చేపట్టాల్సిన పర్యటన అక్టోబర్ 8వ తేదీ నుంచి 9వ తేదీ శుక్రవారానికి వాయిదా పడింది. ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ కె. దినేష్ కుమార్ మంగళవారం రాత్రి ఒక ప్రకటనలో వెల్లడించారు.
ఉప ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించి ఇప్పటికే చేపట్టిన ఏర్పాట్లను యథావిధిగా కొనసాగించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. కొత్తగా నిర్ణయించిన షెడ్యూల్‌కు అనుగుణంగా అన్ని శాఖల అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేస్తూ, పర్యటనకు అవసరమైన ఏర్పాట్లను పూర్తిస్థాయిలో సిద్ధం చేయాలని సూచించారు.
పర్యటన సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా భద్రతా ఏర్పాట్లు పటిష్టంగా చేపట్టాలని, అదే విధంగా పారిశుద్ధ్యం, రహదారుల నిర్వహణ, విద్యుత్ సరఫరా, తాగునీటి వసతి, వేదిక, హెలిప్యాడ్ తదితర ఏర్పాట్లను సంబంధిత అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని కలెక్టర్ ఆదేశించారు.
కొత్త షెడ్యూల్‌కు అనుగుణంగా అన్ని ఏర్పాట్లు సకాలంలో పూర్తి చేసి, ఉప ముఖ్యమంత్రి పర్యటన విజయవంతంగా జరిగేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు.

