Homeఆంధ్రప్రదేశ్పోలవరంచింతూరులోనే ఆటోల ఫిట్‌నెస్ పరీక్షలు నిర్వహించాలి

చింతూరులోనే ఆటోల ఫిట్‌నెస్ పరీక్షలు నిర్వహించాలి

చింతూరు, పెన్ పవర్ అక్టోబర్ 6:

చింతూరు ఏజెన్సీలోని ఆటోలు, ఇతర వాహనాల ఫిట్‌నెస్ (బ్రేక్) పరీక్షలను చింతూరులోనే నిర్వహించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆటో యూనియన్ సభ్యులు కోరారు. నాలుగు మండలాల ఏజెన్సీ ప్రాంతానికి చింతూరు కేంద్రంగా ఉన్నప్పటికీ, గత మూడు నెలలుగా స్కానర్ ద్వారా నిర్వహించే బ్రేక్ పరీక్షల కోసం వాహనాలను రాజమహేంద్రవరం సమీపంలోని రాజానగరంకు తీసుకెళ్లాల్సి వస్తోందని తెలిపారు. దీంతో ఏజెన్సీ ప్రాంత వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. ప్రస్తుతం 100 వాహనాలు పరీక్షలకు వెళ్తే సుమారు 90 వాహనాలకు పరీక్షలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని యూనియన్ సభ్యులు తెలిపారు. దీంతో వాహనదారులు పలుమార్లు రాజానగరానికి వెళ్లాల్సి రావడంతో సమయం, ప్రయాణ ఖర్చులతో పాటు రోజువారీ ఆదాయాన్ని కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతం నుంచి ఘాట్‌రోడ్ల మీదుగా దూరప్రాంతాలకు వెళ్లాల్సి రావడం వల్ల ఇబ్బందులు మరింత పెరుగుతున్నాయని తెలిపారు. చింతూరులోనే ఫిట్‌నెస్ యూనిట్‌ను కొనసాగిస్తే వాహనదారులకు సౌకర్యంగా ఉండటంతో పాటు ప్రభుత్వానికి కూడా ఆదాయం సమకూరుతుందని ఆటో యూనియన్ సభ్యులు పేర్కొన్నారు. ఈ సమస్యపై రవాణాశాఖ మంత్రి, ఎమ్మెల్యేలు, జిల్లా కలెక్టర్, ఐటీడీఏ పీఓ స్పందించి చింతూరులోనే ఫిట్‌నెస్ పరీక్షలు నిర్వహించేలా తగిన చర్యలు తీసుకోవాలని ఆటో యూనియన్ సభ్యులు విజ్ఞప్తి చేశారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular