గొల్లపాలెంలో రెడ్డి అన్నవరం, అంగర శ్రీను మధ్య ప్రధాన పోటీ
మంజేరులో గండి కనకరత్నం, గండి మంగాదేవి మధ్య హోరాహోరీ
కాజులూరులో వట్టూరి పట్టాభిరామయ్య, యాళ్ల వెంకటరమణల మధ్య తీవ్ర పోటీ
కాజులూరు, పెన్‌పవర్, నవంబర్ 21:
గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో కాజులూరు మండలంలో రాజకీయ వేడి రోజురోజుకూ పెరుగుతోంది. మండలంలోని 26 గ్రామ పంచాయతీల్లో సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలకు అభ్యర్థులు పెద్ద ఎత్తున నామినేషన్లు దాఖలు చేయడంతో గ్రామాల్లో ఎన్నికల సందడి నెలకొంది. నువ్వా నేనా అన్న రీతిలో అభ్యర్థులు ప్రచారానికి సిద్ధమవుతుండగా, ప్రధాన గ్రామాల్లో నెలకొన్న పోటీ రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.
నవంబర్ 21న నామినేషన్ల పరిశీలన జరగనుండటంతో అభ్యర్థుల్లో ఉత్కంఠ నెలకొంది. నవంబర్ 22న తిరస్కరణకు గురైన నామినేషన్లపై సాయంత్రం 5 గంటల వరకు అప్పీళ్లకు అవకాశం ఉండగా, 23న అప్పీళ్ల పరిష్కారం చేయనున్నారు. నవంబర్ 22-24 తేదీల్లో అభ్యర్థుల ఉపసంహరణ ప్రక్రియ కొనసాగనుంది. నవంబర్ 24న మధ్యాహ్నం 3 గంటల అనంతరం పోటీలో ఉన్న అభ్యర్థుల తుది జాబితాను ప్రకటించి ఎన్నికల గుర్తులు కేటాయించనున్నారు. నవంబర్ 29న ఆదివారం పోలింగ్ నిర్వహించనున్నారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ గుర్తుల కంటే అభ్యర్థుల వ్యక్తిగత ప్రతిష్ఠ, ప్రజలతో ఉన్న సంబంధాలు, గ్రామాభివృద్ధిపై వారి నిబద్ధతకే ఓటర్లు ప్రాధాన్యత ఇచ్చే అవకాశాలున్నాయి. విద్యార్హతలు, సామాజిక సేవ, ప్రజా సమస్యలపై అవగాహన, అందుబాటులో ఉండే స్వభావం వంటి అంశాలు అభ్యర్థుల గెలుపోటములను ప్రభావితం చేయనున్నాయి.

**గొల్లపాలెంలో రెడ్డి అన్నవరం వర్సెస్ అంగర శ్రీను**
మండలంలో ప్రధాన మేజర్ పంచాయతీ అయిన గొల్లపాలెంలో సర్పంచ్ ఎన్నికల పోరు ఆసక్తికరంగా మారింది. రెడ్డి అన్నవరం, అంగర శ్రీను మధ్య ప్రధాన పోటీ నెలకొంది. యువ న్యాయవాది అయిన రెడ్డి అన్నవరం గ్రామ సమస్యలపై అవగాహన, పంచాయతీ వ్యవహారాలపై పట్టుతో ప్రజల్లోకి వెళ్తున్నారు. వివిధ పేటల్లో ప్రచారానికి వెళ్లిన సమయంలో మహిళలు హారతులతో స్వాగతం పలుకుతూ మద్దతు ప్రకటిస్తున్నారని ఆయన వర్గీయులు చెబుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో ఓటర్లే స్వచ్ఛందంగా ముందుకొచ్చి ప్రచారంలో భాగస్వాములు కావడం విశేషంగా మారింది.
అన్ని పార్టీలకు చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు తనకు మద్దతుగా నిలుస్తున్నారని అన్నవరం పేర్కొంటున్నారు. గుబ్బల ఏసురాజు, నున్న కాశీ, తోట కృష్ణ, ఈశ్వర్ రెడ్డి, జక్కన సత్యనారాయణ, పృథ్వీ, జొన్నకూటి వెంకటేశ్వరరావు తదితరులతో పాటు కూటమి నాయకులు, కార్యకర్తలకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
తాను సర్పంచ్‌గా ఎన్నికైతే గొల్లపాలెం పంచాయతీని సుందరీకరించి ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతానని అన్నవరం హామీ ఇచ్చారు. గ్రామంలో తాగునీటి సమస్య లేకుండా చర్యలు తీసుకోవడంతో పాటు, మురుగునీటి పారుదలకు పూర్తిస్థాయి డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేసి సరైన అవుట్లెట్లు కల్పిస్తానన్నారు. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రత్యేక కోచింగ్ సెంటర్ ఏర్పాటు చేయించి విద్యా, ఉద్యోగ రంగాల్లో ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తానని తెలిపారు. గ్రామంలోని ప్రధాన సమస్యలను రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ దృష్టికి తీసుకెళ్లి శాశ్వత పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. యువత గంజాయి, మత్తు పదార్థాలు, ఇతర చెడు అలవాట్లకు దూరంగా ఉండేలా అవగాహన కార్యక్రమాలు చేపడతానని వెల్లడించారు.
**మంజేరులో ఒకే ఇంటిపేరుతో ఇద్దరు మహిళల మధ్య పోరు**
మంజేరు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో గండి కుటుంబానికి చెందిన ఇద్దరు మహిళల మధ్య పోటీ రసవత్తరంగా మారింది. గండి శ్రీను భార్య గండి మంగాదేవి, మాజీ ఎంపీటీసీ గండి మణికంఠ తల్లి గండి కనకరత్నం సర్పంచ్ అభ్యర్థులుగా బరిలో నిలవడంతో గ్రామంలో ఎన్నికల వాతావరణం వేడెక్కింది. ఇద్దరి ఇళ్లు పక్కపక్కనే ఉండటంతో ఈ పోరు మరింత ఆసక్తికరంగా మారింది.
గ్రామంలో తాగునీటి సమస్య పరిష్కారంతో పాటు బస్సు సౌకర్యం కల్పించడం తన ప్రధాన లక్ష్యమని గండి మంగాదేవి తెలిపారు. గ్రామంలోకి బస్సులు వచ్చేలా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి వాసంశెట్టి సుభాష్ దృష్టికి సమస్యను తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానన్నారు.
మరోవైపు గండి కనకరత్నం మాట్లాడుతూ తన కుమారులు ఇప్పటికే గ్రామంలో రాజకీయ, సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ అభివృద్ధికి కృషి చేశారని తెలిపారు. కూటమి అభ్యర్థిగా తనను గెలిపిస్తే గ్రామంలో మరింత అభివృద్ధి చేపడతానని పేర్కొన్నారు. మౌలిక సదుపాయాల కల్పనతో పాటు గ్రామంలో నెలకొన్న ప్రతి సమస్యను మంత్రి వాసంశెట్టి సుభాష్, సత్యం, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తానని చెప్పారు.
**కాజులూరులో వట్టూరి పట్టాభిరామయ్య, యాళ్ల వెంకటరమణ మధ్య తీవ్ర పోటీ**
మండల కేంద్రం కాజులూరులోనూ సర్పంచ్ ఎన్నికల పోరు ఉత్కంఠభరితంగా మారుతోంది. వట్టూరి పట్టాభిరామయ్య, యాళ్ల వెంకటరమణ మధ్య ప్రధాన పోటీ నెలకొనడంతో గ్రామంలో రాజకీయ సమీకరణాలు ఆసక్తికరంగా మారాయి. ఇరువర్గాలు తమకు అనుకూలంగా ఓటర్ల మద్దతు కూడగట్టుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నాయి. గ్రామంలోని స్థానిక సమస్యలు, అభ్యర్థుల వ్యక్తిగత పరిచయాలు, రాజకీయ మద్దతు ఈ ఎన్నికల్లో కీలకంగా మారనున్నాయి.
మొత్తంగా కాజులూరు మండలంలోని ప్రధాన గ్రామాల్లో సర్పంచ్ స్థానాలకు గట్టి పోటీ నెలకొనగా, నామినేషన్ల పరిశీలన, ఉపసంహరణ అనంతరం ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థులపై స్పష్టత రానుంది. తుది జాబితా విడుదలైన తరువాత ప్రచారం మరింత జోరందుకోనుండటంతో నవంబర్ 29న జరిగే పోలింగ్‌పై గ్రామాల్లో ఉత్కంఠ నెలకొంది.

