Homeతెలంగాణభద్రాద్రి కొత్తగూడెండివైడర్‌ను ఢీకొని పల్టీ కొట్టిన బ్రెజ్జా కారు

డివైడర్‌ను ఢీకొని పల్టీ కొట్టిన బ్రెజ్జా కారు

డివైడర్‌ను ఢీకొని పల్టీ కొట్టిన బ్రెజ్జా కారు

ఎయిర్‌బ్యాగులు తెరుచుకోవడంతో నలుగురికి తప్పిన ప్రాణాపాయం

ఎఫ్‌సీఐ గోదాం సమీపంలో ప్రమాదం.. సెంట్రల్ లైటింగ్ లేక వాహనదారుల అవస్థలు

ఖమ్మం, పెన్ పవర్, నవంబర్ 21:

ఏ క్షణంలో ఏ ప్రమాదం ముంచుకొస్తుందో తెలియని పరిస్థితి.. వేగంగా దూసుకొస్తున్న కారు ఒక్కసారిగా అదుపుతప్పి డివైడర్‌ను బలంగా ఢీకొని పల్టీలు కొట్టింది. కారు నుజ్జునుజ్జయినా.. ప్రమాద సమయంలో ఎయిర్‌బ్యాగులు తెరుచుకోవడంతో అందులో ప్రయాణిస్తున్న నలుగురు ప్రాణాలతో బయటపడ్డారు. ఈ ఘటన ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని జాతీయ రహదారిపై ఎఫ్‌సీఐ గోదాం ఎదురుగా శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది.

స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఖమ్మం నగరానికి చెందిన ఓ కుటుంబం బ్రెజ్జా కారులో హైదరాబాద్ నుంచి ఖమ్మం వైపు వస్తోంది. కారులో ఒక పురుషుడు, ఇద్దరు మహిళలు, ఓ చిన్నారి ఉన్నారు. రాత్రి సుమారు 9 గంటల సమయంలో ఎఫ్‌సీఐ గోదాం సమీపానికి చేరుకోగానే కారు అదుపుతప్పి రహదారి మధ్యలోని డివైడర్‌ను ఢీకొట్టి బోల్తా పడింది. భారీ శబ్దం విన్న స్థానికులు, ఇతర వాహనదారులు వెంటనే అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. బోల్తాపడిన కారును నిలబెట్టి అందులోని వారిని బయటకు తీశారు. కారు నడుపుతున్న వ్యక్తికి తలకు స్వల్ప గాయాలు కాగా, ఇద్దరు మహిళలు, చిన్నారి సురక్షితంగా బయటపడ్డారు. సమాచారం అందుకున్న 108 అంబులెన్స్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రుడికి ప్రథమ చికిత్స అందించారు.

చీకట్లో ప్రయాణం ప్రమాదాలకు నిలయంగా రహదారి

ఎఫ్‌సీఐ గోదాం సమీపంలో జరిగిన ఈ ప్రమాదం జాతీయ రహదారిపై నెలకొన్న సమస్యలను మరోసారి తెరపైకి తెచ్చింది. రహదారిపై సెంట్రల్ లైటింగ్ లేకపోవడంతో రాత్రివేళ వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు డివైడర్ల నిర్మాణం పూర్తిస్థాయిలో లేకపోవడం, దెబ్బతిన్న ప్రాంతాలకు తాత్కాలిక మరమ్మతులకే పరిమితం కావడంతో ప్రమాదాలు జరిగే అవకాశాలు పెరుగుతున్నాయని అంటున్నారు.

ఇప్పటికైనా అధికారులు స్పందించాలి

నిత్యం వాహనాల రాకపోకలతో రద్దీగా ఉండే ఈ మార్గంలో తగిన వెలుతురు ఏర్పాటు చేయడంతో పాటు డివైడర్లకు శాశ్వత మరమ్మతులు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు. ప్రమాద సూచిక బోర్డులు, రిఫ్లెక్టర్లు ఏర్పాటు చేసి వాహనదారుల భద్రతకు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఎయిర్‌బ్యాగులు నలుగురి ప్రాణాలను కాపాడినా. అధికారుల నిర్లక్ష్యానికి మరో ప్రమాదం బలికాకముందే రహదారి భద్రతపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular