మంచం, కత్తెర గుర్తుల మధ్య హోరాహోరీ పోరు
ఒకే గ్రామం.. పక్కపక్క ఇళ్లు
దగ్గరి బంధువుల మధ్య రాజకీయ సమరం
29న తేలనున్న ప్రజాతీర్పు!
కాజులూరు, పెన్ పవర్, నవంబర్ 25:
కాజులూరు మండల పరిధిలోని తణుకువాడ గ్రామ పంచాయతీ ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి. సర్పంచ్ పదవి కోసం కూటమి మద్దతుతో బరిలో ఉన్న పితాని పద్మావతి (మంచం గుర్తు), రాయుడు అనసూర్య లీలాశంకర్ (కత్తెర గుర్తు) మధ్య ప్రధాన పోటీ నెలకొంది. ఇద్దరూ ఒకే గ్రామానికి చెందినవారు, పక్కపక్క ఇళ్లలో నివసించేవారు, ఒకే సామాజిక వర్గానికి చెందిన దగ్గరి బంధువులు కావడంతో ఈ ఎన్నిక గ్రామంలో ప్రత్యేక చర్చనీయాంశంగా మారింది.

గతంలో తణుకువాడ సర్పంచ్, ఎంపీటీసీ స్థానాలకు పోటీ చేసి ఓటమి చెందిన రాయుడు లీలాశంకర్ ఈసారి తన భార్య అనసూర్య లీలాశంకర్ను సర్పంచ్ అభ్యర్థిగా బరిలో నిలిపారు. మరోవైపు పితాని శ్రీనివాస్ భార్య పద్మావతి తొలిసారిగా పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. దీంతో అనుభవం, కొత్త అభ్యర్థిత్వం మధ్య పోటీ ఆసక్తికరంగా సాగుతోంది.

ఇద్దరు అభ్యర్థులు గ్రామ అభివృద్ధే లక్ష్యమంటూ ఓటర్లకు హామీలు ఇస్తున్నారు. పితాని పద్మావతికి మద్దతు పలుకుతున్న వారు తమ అభ్యర్థి విజయంపై ధీమా వ్యక్తం చేస్తుండగా, రాయుడు అనసూర్య లీలాశంకర్కు అన్ని పార్టీల నుంచి మద్దతు ఉందని ఆమె వర్గీయులు చెబుతున్నారు. గెలుపోటముల నిర్ణయం ప్రజల చేతుల్లోనే ఉందని లీలాశంకర్ వర్గం పేర్కొంటోంది.
గ్రామంలో రోజురోజుకూ ప్రచార వేడి పెరుగుతుండగా, స్థానిక నాయకులు, గ్రామ పెద్దలు, ఓటర్లు ఎవరి వైపు మొగ్గు చూపుతారన్నది ఆసక్తికరంగా మారింది. అభ్యర్థులిద్దరూ తమదైన శైలిలో ప్రచారం సాగిస్తూ ప్రజల మద్దతు కూడగట్టే ప్రయత్నం చేస్తున్నారు.
ఈ నెల 29న ఆదివారం జరగనున్న పోలింగ్ అనంతరం వెలువడే ఫలితాలతో తణుకువాడ పంచాయతీ పీఠం ఎవరిని వరించనుందో తేలనుంది. బంధుత్వం, రాజకీయ సమీకరణాలు, అభివృద్ధి హామీల మధ్య సాగుతున్న ఈ పోరులో గ్రామ ఓటర్లు ఇచ్చే తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

