Homeఆంధ్రప్రదేశ్కాకినాడపెనుమళ్లలో సలాది వెంకటరమణకు పెరుగుతున్న మద్దతు

పెనుమళ్లలో సలాది వెంకటరమణకు పెరుగుతున్న మద్దతు

కత్తెర గుర్తుతో హోరెత్తిన ప్రచారం.. గ్రామ అభివృద్ధే లక్ష్యంగా హామీలు

కాజులూరు, పెన్ పవర్, నవంబర్ 25:

కాజులూరు మండల పరిధిలోని పెనుమళ్ల గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కూటమి బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి సలాది వెంకటరమణ (కత్తెర గుర్తు ✂️) ప్రచారంలో దూకుడు పెంచారు. ఎన్నికల గుర్తు కేటాయింపు అనంతరం తన మద్దతుదారులతో కలిసి గ్రామంలో ఇంటింటా విస్తృత ప్రచారం నిర్వహిస్తూ ఓటర్లను కలుస్తున్నారు. కత్తెర గుర్తుపై ఓటు వేసి తనను భారీ మెజారిటీతో గెలిపించాలని అభ్యర్థిస్తున్నారు.

గ్రామ అభివృద్ధే తన ప్రధాన లక్ష్యమని, ప్రజాసేవకు అంకితమవుతానని సలాది వెంకటరమణ పేర్కొన్నారు. గ్రామంలో ప్రధాన సమస్యలుగా ఉన్న తాగునీరు, డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరచడానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. సర్పంచ్‌గా ఒక్క అవకాశం కల్పిస్తే ప్రజలకు మెరుగైన తాగునీటి సౌకర్యం అందించడంతో పాటు డ్రైనేజీ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు కృషి చేస్తానని తెలిపారు.

కూటమి పెద్దలు, నాయకుల సహకారంతో ప్రభుత్వ నిధులను సమకూర్చుకుని గ్రామానికి అవసరమైన అభివృద్ధి పనులు చేపడతానని వెల్లడించారు. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తానన్నారు. తనకు మద్దతుగా నిలుస్తున్న ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు.

ఈ నెల 29న జరగనున్న పంచాయతీ ఎన్నికల్లో కత్తెర గుర్తుపై ఓటు వేసి తనను గెలిపించాలని సలాది వెంకటరమణ ఓటర్లను కోరారు. ప్రచారంలో సలాది రామకృష్ణ, టీడీపీ నాయకుడు వనుం వీరబ్రహ్మం, పలువురు కూటమి నాయకులు, మద్దతుదారులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular