నాచారం ఈఎస్ఐ ఆసుపత్రిలో ఉద్యోగుల బ్లాక్ బ్యాడ్జీల నిరసన
సమస్యలు పరిష్కరించే వరకు దశలవారీగా ఆందోళనలు: ఈఎస్ఐ జేఏసీ
కాప్రా, పెన్ పవర్, నవంబర్ 20:
తెలంగాణ ఈఎస్ఐ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని, కేంద్ర ప్రభుత్వ అధీనంలోని ఈఎస్ఐసీ తీసుకుంటున్న నిర్ణయాలను వ్యతిరేకిస్తూ ఈఎస్ఐ జేఏసీ ఆధ్వర్యంలో శుక్రవారం ఉప్పల్ నియోజకవర్గం నాచారం ఈఎస్ఐ ఆసుపత్రిలో ఉద్యోగులు బ్లాక్ బ్యాడ్జీలు ధరించి నిరసన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఈఎస్ఐ జేఏసీ నాయకులు డాక్టర్ చీమ శ్రీనివాస్ మాట్లాడుతూ తెలంగాణలోని ఈఎస్ఐ ఆసుపత్రులు, డిస్పెన్సరీలపై ఈఎస్ఐసీ తీసుకుంటున్న ప్రతిపాదనలు ఉద్యోగులతో పాటు కార్మికుల్లోనూ ఆందోళన కలిగిస్తున్నాయని తెలిపారు. ముఖ్యంగా నాచారం, రామచంద్రపురం ఈఎస్ఐ ఆసుపత్రులను స్వాధీనం చేసుకోవాలనే ప్రయత్నాలను వెంటనే విరమించుకోవాలని డిమాండ్ చేశారు. ఈఎస్ఐ ఆసుపత్రుల్లో సొసైటీల ఏర్పాటు ప్రతిపాదనలను నిలిపివేయాలని, రెగ్యులర్ డైరెక్టర్‌గా వైద్యుడిని నియమించాలని కోరారు. ఈఎస్ఐ కార్మికులకు మెరుగైన వైద్య సేవలు అందించడంతో పాటు మందుల కొరత లేకుండా, అన్ని రకాల వైద్య పరీక్షలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
అలాగే అన్ని విభాగాల్లో ఖాళీ పోస్టులను భర్తీ చేసేందుకు రిక్రూట్‌మెంట్ చేపట్టాలని, కాంట్రాక్టు ఉద్యోగులకు ప్రతినెలా క్రమం తప్పకుండా వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ సమస్యలు పరిష్కారమయ్యే వరకు దశలవారీగా నిరసన కార్యక్రమాలను కొనసాగిస్తామని జేఏసీ నాయకులు స్పష్టం చేశారు.
తెలంగాణలో కోటి మందికి పైగా ఉన్న ఈఎస్ఐ కార్మికులు, వారి కుటుంబాలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కార్మిక శాఖ మంత్రి వివేక్‌లకు ఈఎస్ఐ జేఏసీ నాయకులు విజ్ఞప్తి చేశారు.

