40 ఏళ్ల నిరీక్షణకు తెర
నాచారం ఎస్సీ శ్మశానవాటికకు మహర్దశ
పరమేశ్వర్ రెడ్డి ప్రత్యేక చొరవతో రూ.1.76 కోట్ల నిధుల మంజూరు
పనుల ప్రారంభానికి అధికారుల పరిశీలన
కాప్రా, పెన్ పవర్, నవంబర్ 11:
నాచారం డివిజన్ పరిధిలోని ఎస్సీ శ్మశానవాటిక అభివృద్ధికి ఎట్టకేలకు మార్గం సుగమమైంది. గత నాలుగు దశాబ్దాలుగా పరిష్కారానికి నోచుకోని శ్మశానవాటిక సమస్యకు పరిష్కారం చూపే దిశగా రూ.1.76 కోట్ల నిధులు మంజూరు కావడంతో స్థానికుల్లో హర్షం వ్యక్తమవుతోంది.
గత ప్రభుత్వాల హయాం నుంచి శ్మశానవాటిక అభివృద్ధి, మరమ్మతుల కోసం స్థానికులు పలుమార్లు ప్రజాప్రతినిధులకు, సంబంధిత అధికారులకు వినతిపత్రాలు సమర్పించినప్పటికీ సమస్య పరిష్కారానికి నోచుకోలేదు. ఈ విషయాన్ని ఉప్పల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి మందుముల పరమేశ్వర్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లడంతో ఆయన ప్రత్యేక చొరవ తీసుకున్నారు. సమస్య తీవ్రతను ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి, శ్మశానవాటిక అభివృద్ధి, మరమ్మతుల కోసం రూ.1.76 కోట్ల నిధులు మంజూరు చేయించడంలో కీలక పాత్ర పోషించారు.
ఈ నేపథ్యంలో త్వరలో ప్రారంభం కానున్న అభివృద్ధి పనులకు సంబంధించి నాచారం డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నూతలకంటి రాజు ఆధ్వర్యంలో బుధవారం సంబంధిత అధికారులు శ్మశానవాటికను సందర్శించారు. డీఈ సాయి పృథ్వీ, ఏఈ సూరజ్ దేశాయ్, వర్క్ ఇన్స్పెక్టర్లు విజయ్, రామ్ క్షేత్రస్థాయిలో పర్యటించి శ్మశానవాటిక ప్రస్తుత పరిస్థితిని పరిశీలించారు. చేపట్టాల్సిన అభివృద్ధి పనులు, మరమ్మతులకు సంబంధించిన అంశాలను సమీక్షించి తదుపరి చర్యలపై చర్చించారు.
ఈ పరిశీలనలో శ్మశానవాటిక కమిటీ సభ్యులు ఎర్పుల నర్సింహ, అయ్యగారి రమేష్, ఎర్పుల శ్రీనివాస్, అయ్యగారి శ్రీకాంత్, ఎర్పుల చిన్న, అయ్యగారి హరీష్, అయ్యగారి పవన్, ఎర్పుల సుజాత తదితరులు పాల్గొన్నారు.
నాలుగు దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్న సమస్య పరిష్కారానికి చొరవ చూపి నిధుల మంజూరుకు కృషి చేసిన మందుముల పరమేశ్వర్ రెడ్డికి నాచారం డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నూతలకంటి రాజు కృతజ్ఞతలు తెలిపారు. నాచారం డివిజన్ ఎస్సీ సంఘాల సభ్యులు, శ్మశానవాటిక కమిటీ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ నాయకుల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.
దీంతో ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న ఎస్సీ శ్మశానవాటిక అభివృద్ధి పనులు త్వరలో ప్రారంభమవుతాయని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

