పుల్లల చెరువు పెన్ పవర్ మే 2
పదో తరగతి పరీక్షల్లో అత్యధిక మార్కులు సాధించి ప్రతిభ చాటిన పుల్లలచెరువు జిల్లా పరిషత్ హైస్కూల్ విద్యార్థి తక్కెళ్ల పవన్ కుమార్‌ను ఉమ్మడి ప్రకాశం జిల్లా కలెక్టర్ రాజబాబు, విద్యాశాఖాధికారులు ఘనంగా అభినందించి సత్కరించారు. విద్యార్థి విజయాన్ని కొనియాడుతూ అధికారులు ఆయనకు శాలువా కప్పి ప్రశంసాపత్రం, మెమొంటో అందజేసి ప్రోత్సహించారు.ఈ సందర్భంగా ఎంఈఓ భాస్కర్ రావు మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతాల విద్యార్థులు కూడా పట్టుదలతో చదివితే ఉన్నత శిఖరాలను అధిరోహించగలరని పవన్ కుమార్ మరోసారి నిరూపించాడని తెలిపారు. సాధారణ పరిస్థితుల్లో చదువుకుంటూ అత్యుత్తమ ఫలితాలు సాధించడం గర్వకారణమని, అతని విజయం ఇతర విద్యార్థులకు మార్గదర్శకంగా నిలుస్తుందని అన్నారు.పవన్ కుమార్ తన లక్ష్యాన్ని స్పష్టంగా నిర్దేశించుకుని క్రమశిక్షణతో చదివిన ఫలితంగానే ఈ విజయాన్ని అందుకున్నాడని ఉపాధ్యాయులు పేర్కొన్నారు. పాఠశాల ఉపాధ్యాయుల మార్గదర్శకత్వం, తల్లిదండ్రుల ప్రోత్సాహం అతని విజయానికి ప్రధాన కారణమని తెలిపారు.ఎంఈఓ ఇందిరా ప్రసాద్ మాట్లాడుతూ, విద్యార్థులు కష్టపడి చదివి తమ ప్రతిభను చాటాలని, ప్రభుత్వం అందిస్తున్న విద్యా అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.ప్రతిభ ఉన్న ప్రతి విద్యార్థిని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొని పవన్ కుమార్‌ను అభినందించారు. గ్రామస్థులు కూడా అతని విజయంపై హర్షం వ్యక్తం చేస్తూ భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.
ప్రతిభవంతునికి ఘన సత్కారం…
RELATED ARTICLES

